
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అవినీతి రహిత పాలన అందించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని, దీనిపై టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలడం సరికాదని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా, పైసా లంచం ఇవ్వకుండా, పారదర్శకంగా.. అర్హతే ప్రామాణికంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.
శ్రీకాకుళం నగరంలోని పీఎన్‌కాలనీలో మంగళవారం ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనాలతో మాట్లాడితేనే ప్రభుత్వ పనితీరుపై వారి సంతృప్తి స్థాయి తెలుస్తుందని చెప్పారు. వ్యవస్థ దానంతటదే పని చేసుకునే పద్ధతి రావాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే జరుగుతుందన్నారు. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజలకు పథకాలు అందించాలని అప్పట్లో ప్రధానిగా రాజీవ్ గాంధీ చెప్పారన్నారు.
మధ్యవర్తుల కారణంగానే అప్పట్లో 90 శాతం స్కీమ్‌లు అర్హులకు చేరేవి కావన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, వ్యవస్థను మార్పు చేస్తూ వివిధ పథకాల కింద లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు నేరుగా అందించామని స్పష్టం చేశారు. ఇది మార్పు కాదా? అని ప్రశ్నించారు. విద్యా రంగంలో సంస్కరణల ద్వారా మంచి మార్పులు తీసుకొచ్చామన్నారు.
నిన్నా మొన్నటి వరకు రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలో 22వ స్థానంలో ఉండేదని, తాజా సంస్కరణల వల్ల ఆ పరిస్థితిలో బాగా మార్పు వస్తోందన్నారు. అయితే సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంత వ్యతిరేకత ఉండటం సహజమని చెప్పారు. ప్రజలు వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుందన్నారు. ఇది అర్థం కాని వారే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని వివరించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్‌సీపీ హయాంలోనే జిల్లా అభివృద్ధి
► బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్, రూ.3 వేల కోట్లతో భావనపాడు పోర్టు నిర్మించనున్నాం. గొట్టా బ్యారేజ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఉద్దానంలో రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, పలాసలో కిడ్నీ రోగుల కోసం రూ.50 కోట్లతో డయాలసిస్ సెంటర్, ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది.
► జిల్లాల పునర్విభజన పూర్తయింది. రిమ్స్‌ను 900 పడకలతో తీర్చిదిద్దాం. ఇదంతా అభివృద్ధి కాదా? ఇది టీడీపీ నేతలకు కనిపించడం లేదా?
మరో తెలంగాణ కాకూడదు..
► రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు పట్టించుకోకుండా, నారాయణ కమిటీ సిఫార్సులను అమలు చేయడం దారుణం. చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం వారి స్వార్థానికి రాష్ట్రంలో ప్రజలందరినీ బలి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మరో తెలంగాణ కాకూడదు. ఈ దృష్ట్యా పాలన రాజధాని విశాఖే అన్న నినాదం వినిపించేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల వెనుకబాటుతనాన్ని గుర్తించిన నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.
► వైజాగ్.. రాష్ట్రం మధ్యలో లేదని కొంత మంది చెప్పడం హాస్యాస్పదం. దేశంలో తమిళనాడు, మహారాష్ట్రల్లో చెన్నై, ముంబై ఎక్కడ ఉన్నాయో గమనించాలి. పాలన రాజధానిగా అందరినీ ఆదరించే గుణం వైజాగ్ సొంతం. న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. దేశంలో సుమారు 8 రాష్ట్రాల్లో ఈ విధంగా రాజధానులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment