![Kottu Satyanarayana Serious Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/29/kottu-satyanarana.jpg.webp?itok=IDTKW_sc)
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ, కులం, మతం, ప్రాంతం ఇలా అన్నింటికీ అతీతంగా అర్హులందరికీ అందుతున్నాయని డిప్యూటీ సీఎం, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలను గ్రామంలో శుక్రవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది.
ఈ సందర్భంగా గ్రామంలోని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన వడ్డూరి రాంబాబు ఇంటి వద్ద ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంత్రి సత్యనారాయణ గడపగడపకు కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి వద్ద ఆ కుటుంబానికి జగనన్న సంక్షేమ పథకాలు ద్వారా చేకూరిన లబ్ధిని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్నకు సంక్షేమ పథకాలు అమలులో పార్టీ, కులం, మతం, ప్రాంతం వంటి ఎలాంటి భేదం లేవన్నారు. అన్నింటికీ అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలనేదే ముఖ్యమంత్రి జగనన్న ఆశయమన్నారు.
గడపగడపకు వెళ్లి ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లక్షలాది రూపాయల లబ్ధిని చదువుతుంటే వారు స్వయంగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రానికి ఏలినాటి శని లాంటి చంద్రబాబు.. నవరత్నాలను నవ మోసాలు అంటూ విమర్శించడం చాలా దారుణమని తీవ్రంగా ఖండించారు. 14 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని సీఎం జగన్‌లా నేను ఎందుకు చేయలేకపోయాను అని పశ్చాత్తాపపడితే బాగుంటుందని హితవు పలికారు. అంతేగానీ, ఇప్పటికీ వయసు మీద పడినా పదవీ కాంక్షతో చంద్రబాబు పిశాచిలా ప్రజలను పట్టిపీడిస్తున్నారని ఫైరయ్యారు.
జనసేన పార్టీకి రాజకీయ సిద్ధాంతం లేదు. పవన్ కళ్యాణ్‌కు గమ్యం లేదని.. స్థిరమైన అభిప్రాయాలు లేవన్నారు. పవన్ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాణించలేడని ప్రముఖ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్ళు తెరిచి మర్రిచెట్టు లాంటి చంద్రబాబును విడిచి బయటకు వస్తే భవిష్యత్తు ఉంటుందన్నారు. అంతేగానీ, చంద్రబాబుతోనే అంటకాగితే తెలుగుదేశంతో పాటు జనసేనకు అడ్రస్ కూడా గల్లంతుకావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరుగొలను గ్రామంలో ఆయన గడపగడపకు వెళ్లి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో చేకూరిన ఆర్థిక లబ్ధిని గణాంకాలతో సహా చదివి వినిపించారు. ఈ క్రమంలోనే ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది.. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది అనేది ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా
Comments
Please login to add a commentAdd a comment