మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
రాజకీయాలంటే.. మానవ సంబంధాలు
నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న అంశం ఏమిటంటే.. రాజకీయాలంటే మానవ సంబంధాలు! ఏ ఒక్క ఎమ్మెల్యేనూ పోగొట్టుకోవాలని నేను అనుకోను. ఏ ఒక్క కార్యకర్తనూ పోగొట్టుకోవాలని కూడా అనుకోను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మాటలను నమ్మవద్దు. మీతో పని చేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ అడుగులన్నీ అందుకోసమే. మీరంతా మళ్లీ గెలిచి రావాలనే ఇవన్నీ చేస్తున్నాం. మనం సరైన పద్ధతుల్లో పనిచేయకపోతే, ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగా లేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి. గ్రాఫ్ పెరగాలంటే ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి. అందుకే గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి. అది సక్రమంగా నిర్వహిస్తే కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది.
– సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ‘మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు అనే వ్యక్తి ఒక ముసుగులో గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, పవన్‌కళ్యాణ్ కలసి చేస్తున్న దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం అధికారంలోకి వచ్చాక తెరపడింది. మళ్లీ చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టి దోపిడీని కొనసాగించేందుకు ప్రభుత్వంపై ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పించేలా గజదొంగల ముఠా దుష్ఫ్రచారం చేస్తోంది.
రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ చేస్తారు. దాన్ని ఎక్కడికక్కడ సమర్థంగా తిప్పి కొట్టాలి’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గడప గడపకూ కార్యక్రమం సగం సచివాలయాల పరిధిలో ఇప్పటికే పూర్తైందని, మిగతా సగం సచివాలయాల పరిధిలో ఆగస్టులోగా పూర్తి చేయాలని నిర్దేశించారు.
నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో పర్యటించాలన్నారు. ఇది పూర్తయితే సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని తెలిపారు.
సంక్షేమ క్యాలెండర్ ప్రకారం వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో బటన్ నొక్కి డబ్బులు జమ చేసే బాధ్యతను తాను నిర్వర్తిస్తానని, గడప గడపకూ వెళ్లి చేసిన మంచిని వివరిస్తూ ప్రజలతో మమేకమై ఆశీర్వాదాలు పొందే బాధ్యతను నేతలు సక్రమంగా నెరవేర్చాలని సూచించారు.
నేను, మీరూ ఏకమై సమన్వయంతో, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తే 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ విజయం సాధించడం ఖాయమని నేతల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే...
రెట్టించిన వేగంతో గడప గడపకూ..
ఫిబ్రవరి 13న గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి 16 వరకూ కొనసాగింది. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనివల్ల గడప గడపకూ కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఆ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపట్టాలి. గేర్ మార్చి రెట్టించిన వేగంతో చేయాలి. అందుకే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం.
నేరుగా రూ.2 లక్షల కోట్లు జమ..
దేవుడి దయ వల్ల రాష్ట్ర చరిత్రే కాదు.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగేళ్లు గడవక ముందే రూ.2 లక్షల కోట్ల పైచిలుకు సొమ్మును ఎలాంటి వివక్షకు తావులేకుండా, లంచాలకు అవకాశం లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశాం. పట్టణ ప్రాంతాల్లో 84 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మంచి చేయగలిగాం.
ఆ ఇళ్లల్లో అక్కచెల్లెమ్మలకు మేలు జరిగింది. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలేదు. అర్హులను పారదర్శకంగా గుర్తించి ప్రయోజనం చేకూర్చాం. పేదలు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసి మరీ సంతృప్త స్థాయిలో పథకాలు అందిస్తున్నాం.
పరిమితి పెంపుతో మరింత ప్రయోజనం
మనం అధికారంలోకి రాక ముందు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6 వేలు మాత్రమే నెలకు ఆదాయ పరిమితిగా ఉన్న బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10 వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12 వేలకు పెంచి పథకాలు అందిస్తున్నాం. తద్వారా 87 శాతం ఇళ్లకు డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా మేలు చేస్తున్నాం.
ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్?
ఈమధ్య కాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబును చూసి కొన్ని మాటలు మాట్లాడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని మాటలు చెబుతున్నారు. వాస్తవాలు అందరికీ తెలియాలి. 21 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో మనం గెలిచాం. ఒక ఎమ్మెల్సీ స్థానం అంటే 34 – 39 నియోజకవర్గాల పరిధి ఉంటుంది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనీసం 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారు.
అంటే 80 లక్షలకుపైగా ఓట్ల పరిధిలో ఎమ్మెల్సీ స్థానం ఉంటుంది. ఆ పరిధిలో 87 శాతం అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలతో మంచి చేస్తున్నాం. 80 లక్షల కుటుంబాల్లో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారు.
మనం మంచి చేసిన 87 శాతం మందిలో ఎమ్మెల్సీ ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఎమ్మెల్సీ ఓటర్లలో 80 శాతం మంది డీబీటీలో లేనివారే ఉన్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు కనిపిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది?
అంతా ఏకమైనా మొదటి ప్రాధాన్యతతో నెగ్గలేకపోయారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరొక అంశం.. ఒకటో ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం, మూడో ప్రాధాన్యతలకు సంబంధించినది. మిగిలిన పార్టీలంతా కలిశాయి. మనం ఒంటరిగా పోటీ చేశాం. అయినప్పటికీ కూడా టీడీపీ మొదటి ప్రాధాన్యతతో గెలవలేకపోయింది.
రెండో ప్రాధాన్యత ఓటు బదిలీ కావడం, ఇంతమంది ఏకం కావడం వల్ల జరిగిన అంశం ఏ రకంగానూ ప్రభావం చూపలేదు. ఒక వాపును చూపించి.. అది బలం అన్నట్లుగా చంద్రబాబు ప్రొజెక్ట్ చేసుకోవడం, దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంత పాడటాన్ని చూస్తున్నాం.
లిస్టు కూడా తయారు చేస్తున్నారంటూ...
రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు. టికెట్లు ఇవ్వని 50 – 60 మంది ఎమ్మెల్యేల లిస్టు కూడా తయారు చేస్తున్నారని చెబుతారు. ఆ జాబితాలో ఇంతమంది వెళ్లిపోతున్నారంటూ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈనాడు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన ఎమ్మెల్యే ఉండరని మన పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యేపైనా ప్రచారం చేస్తున్నారు.
ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు. వాటిని మనం తిప్పికొట్టే కార్యక్రమం చేయాలి. ప్రతి ఊరులో, ప్రతి నియోజకవర్గంలోనూ దీన్ని గట్టిగా చెప్పాలి.
లబ్ధిదారులే మన ప్రచారకర్తలు..
సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి. మన క్యాడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి. క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామక వ్యవస్థను పూర్తి చేసుకోవాలి. ప్రతి లబ్ధిదారుడిని మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలి.
ప్రతి లబ్ధిదారుడు వారికి జరిగిన మంచిని నలుగురితో పంచుకునేలా ప్రోత్సహించాలి. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను మమేకం చేయాలి. వారంతా కలసి ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లాలి. ఇది మీరు కచ్చితంగా చేయాలి.
నెలకు 25 రోజులు గడప గడపకూ..
దాదాపు 15 వేల సచివాలయాలు ఉండగా సగం సచివాలయాల పరిధిలో గడప గడపకూ కార్యక్రమం పూర్తయింది. మిగిలిన సగం కూడా వచ్చే 5 నెలల్లో అంటే ఆగస్టు నాటికి పూర్తి చేయాలి. నెలకు 9 సచివాలయాలను పూర్తి చేయాలి. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి. ఇది పూర్తయితే సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం.
7న ‘జగనన్నే మన భవిష్యత్తు’ ప్రారంభం..
‘జగనన్నే మన భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ఏప్రిల్ 7వతేదీన ప్రారంభిస్తున్నాం. ఇది ఏప్రిల్ 20 వరకు జరుగుతుంది. సచివాలయాల కన్వీనర్, గృహ సారథులను ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. గ్రామ స్థాయిలో మన వ్యవస్ధను ఏకం చేసి ప్రతి ఇంటికి పంపుతున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లేలా ఇది పక్కాగా జరగాలి.
13న ‘జగనన్నకు చెబుదాం’...
వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు స్ప్లిట్ కాకపోవడం లాంటి సమస్యలు గ్రామాల్లో ఒకటి అరా ఉంటే వాటిని కూడా మిస్ కాకూడదని ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ నెల 13న దీన్ని చేపడుతున్నాం. ఎవరికి సమస్య ఉన్నా నేరుగా నాకే ఫోన్ చేయవచ్చు. వాటిని పరిష్కరిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment