సాక్షి, ఏలూరు : రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వకుండా శఠగోపం పెట్టారు. పైగా న్యాయం అడిగిన వారిపై దాడులు చేయించారు. ఆ పచ్చ నేత మోసం చేసింది టీడీపీకి చెందిన రైతులే అయినా..వారంతా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులంటూ ప్రచారం చేశారు. చివరికి అడ్డంగా దొరికిపోయి పరారయ్యారు. బాధితులంతా తాము టీడీపీ రైతులమే అని స్పష్టం చేయడంతో పాటు ధూళిపాళ్ళ నరేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులపై దాడి చేయించిన నరేంద్రను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఏలూరు జిల్లా లింగాయపాలెం మండలం వేములపల్లి, నరసన్నపాలెం గ్రామాల్లో ద్వారకాయయి మిల్క్ సెంటర్‌తో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ పాలుపోసేలా ఒప్పందం కుదుర్చుకుంది. వేములపల్లి సర్పంచ్ ముసులూరి రాము, నర్సన్నపాలెం సర్పంచ్ కూరపాటి వెంకటేశ్వర్లు తమ గ్రామాల పరిధిలో పాలను సేకరించి సంగం డెయిరీకి సరఫరా చేస్తున్నారు.
14 శాతం బోనస్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతులందరి నుంచి గ్రామాల్లో పాలు సేకరించి సంగం డెయిరీకి చేర్చేవారు. అయితే రైతుల దగ్గర పాలుపోయించుకుని కేవలం నాలుగుశాతం మాత్రమే బోనస్ ఇస్తామని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అడ్డం తిరిగారని రైతులు ఆరోపిస్తున్నారు.
తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఏలూరు జిల్లాకు చెందిన రైతులంతా సంగం డెయిరీకి వచ్చారు. రైతులు సంగం డెయిరీకి వచ్చి కార్లు దిగారో లేదో... ధూళిపాళ్ల నరేంద్ర కిరాయి సైన్యం ఒక్కసారిగా తమపై దాడికి దిగారని రైతులు ఆరోపిస్తున్నారు. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా బాదిపడేశారని అంటున్నారు. రైతులు తీసుకొచ్చిన కార్లను కూడా ధ్వంసం చేశారని విమర్శించారు.
తాము డెయిరీకి పాలుపోసిన రైతులమని చెప్పినా కూడా కనికరం చూపించలేదని ఆక్రోశించారు. నరేంద్ర కిరాయి రౌడీల దాడిలో పదిహేను మంది రైతులు గాయపడ్డారు. ఈ దాడిపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్రతోపాటు మరో పద్నాలుమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సమాచారం తెలుసుకున్న ధూళిపాళ్ల నరేంద్ర, అతని అనుచరులు వారం రోజులపాటు పరారయ్యారు. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన నరేంద్ర రైతులను కిరాయి మూకలని అడ్డగోలు దబాయించాడు. అంతేకాదు ప్రభుత్వమే ఈ పని చేయించిందంటూ దుష్ప్రచారం చేశాడు.
వాస్తవానికి వేములపల్లి సర్పంచ్ ముసులూరి రాము కరడుగట్టిన తెలుగుదేశం నాయకుడు. 2015నుంచి 2019వరకూ లింగయపాలెం మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. రెండేళ్లక్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుతో ముసులూరి రాము భార్య సర్పంచ్ గా గెలిచింది. చంద్రబాబు, లోకేష్‌తో కూడా ముసులూరి రాముకు పరిచయాలున్నాయి. లోకేష్ పాదయాత్రకు కూడా లక్షలు ఖర్చుపెట్టాడు. టీడీపీకి చెందిన ముసులూరి రామును వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
ధూళిపాళ్ల నరేంద్ర నిజస్వరూపాన్ని చూసిన ఏలూరు జిల్లా రైతులు చీదరించుకుంటున్నారు. తమ కష్టాన్ని దొగింలించిన నరేంద్ర తమను కిరాయి వ్యక్తులుగా చిత్రీకరించడం దారుణమంటున్నారు. ఎప్పటినుంచో టీడీపీలో ఉన్న తమకు సొంత పార్టీ నేతే మోసం చేసి, దాడి చెయ్యడం... ఇప్పుడు తమను వైసీపీ నాయకులనడం విడ్డూరంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment