కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరేయాలని కలలు కంటున్న బీజేపీకి ఆ పార్టీలోని నేతల మధ్య విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఉన్న పాత లీడర్లతో పాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున కాషాయతీర్థం పుచ్చుకున్న నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తకుండా పార్టీ పెద్దలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఏదో ఓమూలన అసంతృప్తి జ్వాలలు ఎసిపడుతూనే ఉన్నాయి. టీఎంసీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న మమతా బెనర్జీతో సరితూగే నేత బెంగాల్ బీజేపీలో లేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది. మరోవైపు ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే ఉన్నా.. సీఎం అభ్యర్థిపై ఎటూ తేల్చుకోలేపోవడం స్థానిక నేతల్ని అయోమయానికి గురిచేస్తోంది. (బీజేపీ వ్యూహం.. మమతకు చెక్)
తామంటే తామే సీఎం అభ్యర్థి అంటూ ఎవరికి వారే అనుచరుల వద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ బాంబు పేల్చారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని, ఆయన అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన ప్రకటనపై దిలీప్ అనుచరవర్గం సంబరాలు చేసుకోగా.. ఆయన వ్యతిరేక వర్గంతో పాటు ఇటీవల టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సౌమిత్రా వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సైతం గుర్రుగా ఉన్నారు. సీఎం అభ్యర్థిపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పక్కా బెంగాలీ వ్యక్తే సీఎంగా ఉంటారని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. పార్టీలో చర్చించకుండా బహిరంగ సభల్లో ఇలాంటి ప్రకటనలు చేయడం సరైనది కాదని సౌమిత్రాను సముదాయించారు. (ఆపరేషన్ బెంగాల్.. దీదీకి ఓటమి తప్పదా?)
మరోవైపు టీఎంసీ సైతం మరింత దూకుడు పెంచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అనేక ప్రకటనలు చేస్తున్న అమిత్ షా.. ముందుగా బీజేపీ అభ్యర్థి ఎవరో తేల్చాలని ఆ పార్టీ నేతలు సవాలు విసురుతున్నారు. మమతా బెనర్జీకి సరితూగే నేత బీజేపీలో లేరని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా బెంగాల్‌లో బీజేపీకి అధికారం అప్పగిస్తే ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తికి సీఎం బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాగా 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment