
ఢిల్లీ: కర్ణాటక సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ పవర్ షేరింగ్ ఫార్ములా.. అంటే చెరో రెండున్నరేళ్లు(50:50 నిష్పత్తిలో) లేదంటే ఒకరు మూడు, మరొకరు రెండు ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం. ఆ గ్యాప్‌లో మరొకరికి డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పోర్ట్‌పోలియోలు అప్పజెప్పడం.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రూపొందించిన పవర్ షేరింగ్ ఫార్ములా ఇదేనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
కాంగ్రెస్ సీఎం అయ్యే అవకాశం ఇంకా డీకే శివకుమార్‌కు దూరం కాలేదా?. ఆ ఛాన్స్ ఇంకా ఉందా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పైకి పవర్ షేరింగ్ ఫార్ములాకు డీకేఎస్ అంగీకరించలేదని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆయన్ని షరతుల మీద అందుకు ఒప్పించే డిప్యూటీ సీఎం పదవి(పీసీసీ చీఫ్, 6 పోర్ట్‌పోలియోలుకూడా) కాంగ్రెస్ హైకమాండ్ కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ హైకమాండ్.. డీకే శివకుమార్‌కు ఇచ్చిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 25 దక్కించుకోగా.. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. దీంతో.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం కోసం కృషి చేసి మెరుగైన ఫలితం ఇస్తే డీకే శివకుమార్‌ను కర్ణాటక సీఎం కుర్చీలో.. అదీ మిగతా రెండున్నరేళ్లు/ మూడేళ్ల కాలానికి కూర్చోబెడతామని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీనికి శివకుమార్ సైతం అంగీకరించినట్లు సమాచారం.
అయితే ఈ ఫార్ములాపై ఆయన ఏమన్నారంటే.. ‘‘పవర్ షేరింగ్ ఫార్ములాను నేను వెల్లడించలేను. మేమంతా కలిసి జరిపిన చర్చలను నేను బహిర్గతం చేయదలచుకోలేదు. ఏదో ఒక సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు దీనికి సమాధానం ఇస్తారు. ప్రస్తుతానికి నేను బాధపడటం లేదు. ప్రయాణం ఇంకా మిగిలి ఉంది అని వ్యాఖ్యానించారు.
‘‘పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాజీపడ్డాను. కర్ణాటక ప్రజలకు మా నిబద్ధత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తలవంచాల్సిందే. పార్టీ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నా అని డీకేఎస్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment