ముంబై: సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిసిన ఉద్దవ్.. షిండే అసలైన సీఎం కాదని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం ముందుకెళ్లరాదని హెచ్చరించారు. ముంబైలోని సేన భవన్‌లో ఉద్దవ్ శుక్రవారం మాట్లాడుతూ.. మెట్రో కార్ షెడ్‌ను ఆరే కాలనీకి మార్చవద్దని కోరారు. ముంబై పర్యావరణాన్ని నాశనం చేయొద్దని సూచించారు.
‘నాకు ద్రోహం చేసినా పర్లేదు కానీ ముంబైకు ద్రోహం చేయకండి. నా మీద కోపాన్ని ముంబై ప్రజలపై చూపించొద్దు. మెట్రో షెడ్ ప్రతిపాదనను మార్చవద్దు. మేము అభివృద్ధికి అడ్డుపడటం లేదు కానీ ముంబైని వెనుకబాటు గురి చేయకుండా పాలించండి. ముంబై పర్యావరణంతో ఆటలాడకండి. పర్యావరణానికి హాని చేసే ఈ నిర్ణయం మంచిది కాదు. మేం దానికి ప్రత్యామ్నాయం ప్రతిపాదించాం. పర్యావరణ సహితంగా నిర్ణయం తీసుకోండి
నేడు సీఎం పదవిని బీజేపీ కాదనుకుంది. నేను రెండున్నర సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాను. శివసేన, భాజపా ముఖ్యమంత్రి పదవిని సగం కాలం పంచుకోవాలని నాకు, అమిత్ షా అదే ఫార్ములా నిర్ణయించుకున్నాం. 2019లో కుర్చీల పంపకాన్ని ఎందుకు తిరస్కరించింది. మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంది’ అని ఠాక్రే ప్రశ్నించారు.
చదవండి: మహారాష్ట్ర: షిండే రాక.. కాషాయ నేతల్లో అప్పుడే కలకలం..
ప్రాజెక్టు వివాదం ఏంటీ
ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ నిర్మించాలని అప్పట్లో ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు బీఎంసీ, మెట్రోరైల్ కార్పొరేషన్ అనుమతులు కూడా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆరే కాలనీలో వందలాది చెట్లు నరకాల్సి వస్తుంది. దీనిపై పర్యావరణ వేత్తలనుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి.
తర్వాత 2019లో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెట్రో లైన్ 3 కారిడార్ షెడ్‌ను ఆరే కాలనీలో నిర్మించడాన్ని వ్యతిరేకించింది. దీన్ని కుంజుర్‌మార్గ్‌కు మార్చాలని నిర్ణయం తీసుకుంది. అఘాడి ప్రభుత్వం ఆరే కాలనీని రిజర్వ్ అటవీ ప్రాతంగా గుర్తించింది. అయితే మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే మెట్రో కార్ షెడ్‌పై ఉద్దవ్ నిర్ణయాన్ని పక్కనపెట్టి తిరగి ఆరే కాలనీలో చేపట్టాలని నిర్ణయించారు. కంజుర్‌మార్గ్ నుంచి మళ్లీ ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్‌ను మారుస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment