టెక్కలిలో అచ్చెన్న దౌర్జన్యాలెన్నెన్నో.. | Duvvada Srinivas Comments On Atchannaidu Kinjarapu | Sakshi
Sakshi News home page

టెక్కలిలో అచ్చెన్న దౌర్జన్యాలెన్నెన్నో..

Published Sun, Feb 14 2021 5:02 AM | Last Updated on Sun, Feb 14 2021 8:54 AM

Duvvada Srinivas Comments On Atchannaidu Kinjarapu - Sakshi

సాక్షి, అమరావతి:  టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన నేరాలు, ఘోరాలకు పాల్పడుతూ ప్రజల, ప్రభుత్వ ఆస్తులను అచ్చెన్నాయుడు లూటీ చేశారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. రౌడీ, గూండా, క్రిమినల్‌ అయిన తెలుగు దొంగలపార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతిలో కూర్చుని తాము నిజాయితీపరులమని, ప్రజాస్వామ్యవాదులమని నీతులు చెబుతుంటారని, ఆయన బతుకేంటో టెక్కలి, శ్రీకాకుళం జిల్లా ప్రజలనడిగితే చెబుతారన్నారు. అచ్చెన్నాయుడు రెండెకరాల నుంచి ఈరోజు వేల కోట్లకు పడగలెత్తారని, ఇవన్నీ ఎక్కడినుంచి సంపాదించారో చెప్పాలన్నారు. అచ్చెన్నాయుడు దౌర్జన్యాలు, అక్రమాలపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేసి న్యాయవిచారణ జరిపించాలన్నారు. అలా జరిపిస్తే.. సాక్ష్యాధారాలతోసహా తాను నిరూపిస్తానన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

అచ్చెన్నాయుడి తండ్రి హయాంనుంచే హత్యా రాజకీయాలు మొదలుపెట్టారన్నారు. రిగ్గింగ్‌లు, రౌడీయిజంతో కింజరాపు బ్రదర్స్‌ ఇంతకాలం టెక్కలి ప్రాంతంలో ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో, ఆయన బంధువు కింజరాపు అప్పన్న నామినేషన్‌ వేయాలనుకుంటే చంపేస్తామని బెదిరించడాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జిగా తానక్కడికి వెళితే 500 మంది రౌడీలు కత్తులు, కర్రలు, బరిసెలతో దాడి చేశారని, తనను, అప్పన్నను చంపాలని చూశారని వివరించారు. అచ్చెన్న దౌర్జన్యాలకు కాలం చెల్లిందని, మొదటిదశ ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 135 పంచాయతీలకు 113 స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిచారని, టీడీపీవారు 22 స్థానాల్లోనే నెగ్గారన్నారు. రిగ్గింగ్‌కు అవకాశం లేకుండా చూడడంతో ప్రజలంతా స్వేచ్ఛగా ఓట్లు వేశారన్నారు. టెక్కలి ప్రజలు తిరగబడి తరిమికొట్టినా అచ్చెన్నాయుడుకు సిగ్గురాలేదన్నారు.



వేల కోట్లకు పడగలెత్తారు.. 
కింజరాపు బ్రదర్స్‌ అక్రమాస్తులు వేల కోట్లకు చేరాయని దువ్వాడ ఆరోపించారు. ‘‘నిమ్మాడలో ప్రభుత్వ భూముల్లో ఎఫ్‌సీఐ గోడౌన్స్‌ నిర్మించి.. వారి కుటుంబసభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. ప్రజల భూముల్నిసైతం ఆక్రమించుకున్నారు. భవానీ గ్రానైట్స్‌ ఫ్యాక్టరీలో 2014–19 మధ్య క్వారీల్లో రాళ్లను పర్మిషన్‌ లేకుండా అక్రమంగా తరలించి కట్‌ చేశారు. ఇలా రూ.39 కోట్ల రాయిని అక్రమంగా తరలించారు. టెక్కలిలో కాంట్రాక్టుల పేరుతో కోట్లు మింగేశారు. సారా కాంట్రాక్టర్‌గా అచ్చెన్నాయుడు 75 షాపులు బినామీగా పెట్టుకుని మద్యం అక్రమ వ్యాపారాన్ని నడిపారు. రైస్‌ మిల్లర్లు, మద్యం షాపులవద్ద నెలవారీ మామూళ్లు వసూలు చేశారు. పీఏసీఎస్‌ అధ్యక్షునిగా ఉన్న అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్‌ దాన్నడ్డుపెట్టుకుని బినామీల ఆస్తులపై రుణాలు తీసుకుని రూ.18 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడ్డారు. సింగపూర్‌లో హోటళ్లు, షిప్‌లు కూడా ఉన్నాయి’’ అని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ న్యాయస్థానాల్లో సాక్ష్యాలతోసహా నిరూపిస్తామని దువ్వాడ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement