ఇంటికి వెళ్లి పార్టీ వీడొద్దని ఆవేదన పడినా ఫలితం లేకుండా పోయింది
స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్‌ఎస్‌లో చేరిన మీరు బాధపడుతున్నా అని అంటున్నారు
ఇంకా ఏ ముఖం పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడతారు?
అసెంబ్లీలో సబితపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తనకు 2018లో సీఎల్పీ నేతగా, ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించిందని, ఒక దళితుడికి సీఎల్పీగా అవకాశం లభించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌లో దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి తన వెనక ఉండి ప్రతిపక్ష నేతగా నిలబెట్టాల్సింది పోయి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది నేతలతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి పార్టీ విడిచి వెళ్లవద్దని, మీరు వెళ్తే సభ్యుల సంఖ్య తగ్గి ప్రతిపక్ష నేత హోదాను కోల్పోతానని, కాంగ్రెస్ పరువుపోతుందని ఆవేదన పడినా ప్రయోజనం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన వాగ్వాదానికి స్పందిస్తూ ఆయన మాట్లాడారు. ‘అధికారం, స్వార్థం కోసం కాంగ్రెస్ వదిలి టీఆర్‌ఎస్‌లో చేరిన మీరు బాధపడుతూ మాట్లాడుతున్నా అంటున్నారు. అసలు బాధ పడాల్సింది నేనా? కాంగ్రెస్ పార్టీనా? మీరా? ఇంకా ఏం ముఖం పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడతా రు? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని భట్టి విక్రమార్క తీవ్ర స్వరంతో మాట్లాడారు. వేరే పార్టీలో ఉన్న సబితను 2004లో కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్ ఇచ్చి ఐదేళ్లు మంత్రిగా చేసినట్టు గుర్తు చేశారు. 2009లో మళ్లీ టికెట్ ఇచ్చి మళ్లీ ఆమెను మంత్రిని చేసి అత్యంత ముఖ్యమైన శాఖలు అప్పగించారన్నారు. 2014లో పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చిందని, వాళ్ల అబ్బాయికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చిందని భట్టి చెప్పారు.
మోసం చేశారు: మంత్రి సీతక్క
కాంగ్రెస్‌లో చేరిన (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయించారని బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క మండిపడ్డారు. వారితో రాజీనామా చేయించి బీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నారా? సబితతో రాజీనామా చేయించారా? అని నిలదీశారు. మీతో వస్తామని చెప్పి ఒకరిద్దరు మహిళలు ఏం చేశారో తనకు తెలుసని, ఆ బాధను సీఎం అనుభవించారని చెప్పారు.
(కాంగ్రెస్‌లో చేరేందుకు) ఢిల్లీకి వస్తున్నామని వారు చెప్పడంతో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ వద్ద సమయాన్ని తీసుకున్నారని, ఆ తర్వాత రాకుండా మోసం చేశారన్నారు. ఆ బాధ అనుభవించిండు కాబట్టే కేటీఆర్‌కు సీఎం సూచన చేశారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెను ఉద్దేశించి నీకేం తెలియదు అనగా, నీ దురహంకారాన్ని బంద్ చేసుకో అని సీతక్క తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారికి ఎంతో చేసిందని, అదే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వారిద్దరు చప్పట్లు కొట్టడం సబబేనా? అని సబిత, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
ఆసక్తి లేకుంటే వెళ్లిపోవచ్చు: మంత్రి శ్రీధర్‌బాబు
సభా నాయకుడు సీఎం మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరూ సభలో కూర్చొని ఉండాలనే సంప్రదాయం ఉందని, కూర్చునే ఆసక్తి లేని వాళ్లు వెళ్లిపోవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతున్నప్పుడు బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ వెల్ వద్ద చేరి ఆందోళన చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా తనకున్న అధికారాలను సైతం ప్రశ్నిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారని మండిపడ్డారు. తీరు మారకపోతే సభలో (సస్పెన్షన్ తరహా) తీర్మానం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment