ఇది కాంగ్రెస్ విషప్రచారం..
దీనిపై బీజేపీలో ఎలాంటి చర్చ లేదు: ఎంపీ ఈటల
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ఊహాజనితం, అది జరగదు’అని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ‘ఇది కాంగ్రెస్ విషప్రచారం. బీజేపీలో అలాంటి చర్చ లేదు. దీనిపై పార్టీలో ఎలాంటి ప్రస్తావన లేదు’అని తెలిపారు. బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనం అవుతుందని ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈటల స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రుణమాఫీ పూర్తిగా జరిగిందని ప్రభుత్వం ప్రకటించడం బక్వాస్, బుకాయిస్తున్నారు’అని మండిపడ్డారు. ‘అబద్ధపు ప్రచారంతో రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రుణమాఫీ పూర్తిగా కాలేదని దమ్ముంటే ఒప్పుకోవాలి. బ్యాంకర్ల లెక్కల ప్రకారం రూ.72 వేల కోట్ల వరకుÆ రుణమాఫీ చేయాల్సి ఉండగా.. ఎన్నికల ముందు రేవంత్ రూ.63 వేల కోట్లు అని హామీఇచ్చారు. విధివిధానాల పేరుతో ఆ మొత్తాన్ని రూ.34 వేల కోట్లకు కుదించారు. ఇప్పుడు 22 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి, పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు. ఒక్క ఘట్‌కేసర్ సొసైటీలోనే 1,200 మంది రైతులకు రూ.9 కోట్ల రుణాలలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.
కానీ వందలకోట్ల ప్రజాధనంతో కేసీఆర్ తరహాలోనే ప్రచారాలు చేసుకుంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’అని ఈటల ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం, ఉన్నతాధికారులు హంగామా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘హైడ్రా పేరుతో జరుగుతున్న డ్రామా ఆపాలి. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న పట్టాభూముల్లో నిర్మాణాలు కూల్చవద్దు. నీళ్లు రాకుండా ఏర్పాటు చేయాలి. చిత్తశుద్ధి ఉంటే ఇకపై నిర్మాణాలు జరగకుండా చూడాలి. అక్రమకట్టడాల విషయంలో కఠినంగా ఉంటాం అని చెప్పుకుంటున్నారు. వాళ్లు ఏమి చేస్తున్నారో ఆ చిట్టా మా వద్ద ఉంది. డ్రామాలు ఆపితే మంచిది’అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
రక్షాబంధన్ కార్యక్రమానికి గవర్నర్‌కు ఆహ్వానం: ఈనెల 18న ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఉప్పల్ భగాయత్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న రక్షాబంధన్ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఈటల రాజేందర్ ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment