న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం 10 గంటలకుపై గా ప్రశ్నించింది. ఉదయం 11.15గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్‌కు రాత్రి సుమారు 8 గంటల సమయంలో కొద్ది విరామం ఇచ్చి తిరిగి విచారణ కొనసాగించారు.
ఇప్పటి వరకు ఈడీ రాహుల్‌ను ఐదు రోజులపాటు 50 గంటలకుపైగా ప్రశ్నించింది. మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత కూడా విచారణ కొనసాగినట్లు సమాచారం. ఈడీ కార్యాలయం వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉండగా, మంగళవారం ఆయన ఈడీ కార్యాలయంలో ఉన్న సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ విచారణను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే కొనసాగిస్తున్న నిరసనలను మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ చట్ట సభ్యులకు, ముఖ్యనేతలకు ఢిల్లీకి రావాలని పిలుపు ఇచ్చింది. తద్వారా తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించాలని అనుకుంటోంది.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఈనెల 23వ(గురువారం) ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా నుంచి కోలుకున్న ఆమె హాజరయ్యేది కాస్త అనుమానంగానే ఉంది. ఇదిలా ఉంటే.. తమ నేతను ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకంపై వెల్లువెత్తుతున్న నిరసనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈడీ విచారణ పేరుతో వ్యక్తిగతంగా వేధిస్తోందని ఆరోపించింది. ఈడీ విచారణ అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థను బీజేపీ సొంతానికి వాడుకోవడం నిజంగా విషాదకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment