ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై అధికార మహాయుతి కూటమిలో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భేటీ అయ్యారు.ఈ ఇద్దరి మధ్య భేటీ సానుకూలంగా జరిగిందని ఏక్‌నాథ్ షిండే మీడియాకు వెల్లడించారు.
‘అమిత్‌షాతో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి,ప్రమాణ స్వీకారం వంటి అంశాలపై చర్చించాం. మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉంది. మహారాష్ట్ర సీఎం ఎవరు? అనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది.ఈ అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మహా సీఎం ఎంపికపై కసరత్తు పూర్తయిన వెంటనే వివరాల్ని వెల్లడిస్తాం. మహారాష్ట్ర ప్రజలు తమను భారీ మెజారిటీతో మరోసారి గెలిపించారు. ప్రజల ఆదేశాల్ని గౌరవించడమే ప్రాధాన్యత. పదవుల కోసం పాకులాడం’ అని ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 132 సీట్లు సొంతం చేసుకోగా.. షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్‌సీపీకి 41 సీట్లు దక్కాయి.
ఆ నిర్ణయం కమలం పెద్దలదే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. దీంతో మహారాష్ట్ర సీఎంగా ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని మహాయుతి కూటమిలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ,ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మహా సీఎం నిర్ణయాన్ని బీజేపీ పెద్దలకే అప్పగిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.
ఈ క్రమంలో అమిత్ షాతో ఏక్‌నాథ్ షిండే భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం మహరాష్ట్ర సీఎం ఎవరు? ఏ కూటమికి ఎన్ని మంత్రి పదవులుతో పాటు ఇతర అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment