UP Assembly Elections 2022: 2013 ముజఫర్‌నగర్ హింసాత్మక ఘటనలతో జాట్‌లు, మైనార్టీల మధ్య చీలిక ఏర్పడి.. 2017 ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. మెజార్టీ సీట్లతో బంపర్ విక్టరీ సాధించింది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
తొలి దశలో పశ్చిమ యూపీలో ప్రధానంగా వార్తల్లో ఉన్న నియోజకవర్గాలైన కైరానా, థాన్‌భవన్, సర్దానా, ఆగ్రా రూరల్, మథుర, నొయిడా, హస్తినాపూర్ పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో యోగి క్యాబినెట్‌లోని మంత్రులు బరిలో ఉన్నారు. మంత్రులు శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌లు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీళ్లలో ఇప్పుడు టెన్షన్ టెన్షన్ నెలకొంది.
ఓటమి ఆందోళనకు కారణాలు..
►పశ్చిమ యూపీ రీజియన్.. చెరుకు పంటకు ఫేమస్. అయితే ఈ ప్రాంతంలోని రైతులకు రూ.1.5 లక్షల కోట్లు చెల్లించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకొంటోంది. కానీ, ఈ విషయంలో రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
►జాట్ ఓటర్లు.. తొలి దశ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ సామాజిక వర్గమే ముందుండి నడిపించింది.
►జాట్‌లలో పట్టున్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ)తో పొత్తు సమాజ్‌వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం మరో కీలక పరిణామం.
►గత ఎన్నికల్లో 58 సీట్లకుగానూ బీజేపీ 53 సీట్లను గెలుచుకుంది. 2017 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆర్ఎల్డీ.. ఈసారి ఎస్పీ వెంటనడుస్తోంది.
►కరోనా సమయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరుపైనా నిరసనలు వెల్లువెత్తాయి.
►సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో పశ్చిమ యూపీ కీలక పాత్ర పోషించింది. దీంతో బీజేపీపై ఇది కొంత ప్రతికూలాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌కు ముఖద్వారమైన ఢిల్లీ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్‌పత్, మేరఠ్, గాజియాబాద్, హాపుఢ్, గౌతమబుద్ధనగర్, బులంద్‌షెహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాలు ఉన్నాయి.
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. కోవిడ్-19 నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 623 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సంబంధిత వార్త: నామినేషన్లో రెండో భార్య పేరు.. మొదటి భార్య అలక, ఆపై..
Comments
Please login to add a commentAdd a comment