
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రిమండలి సమావేశ నిర్వహణపై గందరగోళం వీడింది. ఇవాళ భేటీ ఉంటుందని రెండ్రోజుల కిందటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. సీఎం కార్యాలయం నుంచి మంత్రులకు ఇప్పటిదాకా అధికారిక సమాచారం వెళ్లకపోవడంతో ఉంటుందా? ఉండదా? అనే చర్చ నడిచింది. చివరకు సాయంత్రం భేటీ ఉంటుందని తెలుస్తోంది.
కీలకమైన అంశాలపై తెలంగాణ మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగానే తెలంగాణ కేబినేట్ సమావేశం పై తర్జనభర్జన కొనసాగింది. మరోవైపు ఇప్పటికే కేబినేట్ భేటీలో చర్చించే అంశాలు ఇవేనంటూ సీఎంవో కొన్ని అంశాలను మీడియాకు విడుదల చేసింది.
తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలు
రుణమాఫీ నిధుల సమీకరణ పై నిర్ణయం
ధాన్యం కొనుగోళ్లు , ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ
రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చ
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ
కొత్త విద్యా సంవత్సరం లో చేపట్టవలసిన చర్యలపై చర్చ
కేబినెట్ భేటీ నిర్వహణ కోసం ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. అయితే అనుమతి దొరికిందా? లేదా? అనే స్పష్టత రాలేదు. ఈలోపే సాయంత్రం 4గం. కేబినెట్ భేటీ ఉంటుందని మీడియాకు సీఎంవో సమాచారం అందించింది.
Comments
Please login to add a commentAdd a comment