రసవత్తరంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అత్యధిక ఓట్లు కొల్లగొట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ రైతులు, యువత, మహిళలను ఆకర్షించేలా సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. వీరి ఓటుబ్యాంకే 50 నుంచి 60 శాతం మధ్యలో ఉండడంతో వీరి చుట్టూనే సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో సిద్ధమౌతోంది. ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు పలికి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ఎస్పీ, ఇప్పుడు రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నేతల మద్దతు కూడగట్టే యత్నాలకు దిగింది. మరోవైపు యువతను ఆకర్షించేందుకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకాన్ని ప్రకటించిన అఖిలేశ్, మహిళల భద్రత అంశాన్ని తెరపైకి తెస్తూ వారి ఓట్లను రాబట్టుకొనే చర్యలకు పదునుపెట్టారు. ఈ మూడు వర్గాలనుంచి వీలైనన్ని ఓట్లను రాబట్టుకొని తన విజయావకాశాలు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టారు.
రైతు సంక్షేమమే ఎజెండా
అందులోభాగంగా రైతులకు సంబంధించి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు చెరుకు రైతులకు 15 రోజుల్లో చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాక రైతులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, సాగునీటికి వడ్డీలేని రుణాలతో పాటు బీమా, పింఛన్ సౌకర్యాలు సైతం ప్రకటించారు. బీజేపీని రాష్ట్రం నుంచి తొలగిస్తామని ప్రతిజ్ఞ చేయాలని అఖిలేశ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని, ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇస్తామని అఖిలేశ్ ప్రకటించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత విడుదల చేసే సమాజ్‌వాదీ మేనిఫెస్టోలో ఇవన్నీ పొందుపరుస్తామని ఎస్పీ అధినేత పేర్కొన్నారు. గతంలో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన అఖిలేశ్ రైతు ఉద్యమ నేతలతో సన్నిహితంగా ఉంటూ వారి మద్దతును కూడగట్టుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక రైతు నేత నరేశ్ తికాయత్ ఎస్పీ కూటమికి మద్దతును ప్రకటించడం ఈ చర్యల్లో భాగమేనని పార్టీ వర్గాలు తెలిపాయి.
మహిళల భద్రత– యువతకు ఉపాధే లక్ష్యం
ఓట్ల శాతాన్ని పెంచేందుకు రాష్ట్రంలో తమ పార్టీ టార్గెట్ చేయాల్సిన ఓటుబ్యాంకుకు సంబంధించి సుదీర్ఘ కసరత్తును అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే పూర్తి చేశారు. ముస్లిం–యాదవ్ ఫార్ములాతో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ఠంగా 30 శాతం ఓటుబ్యాంకు మార్కును టచ్ చేయలేకపోయిన సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో మహిళలు–యువత ఫార్ములాతో కనీసం 40 నుంచి 50 శాతం ఓట్లు రాబట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని అఖిలేశ్ ఇప్పటికే అనేకసార్లు విమర్శించారు. ఉన్నావ్, గోరఖ్‌పూర్, హథ్రాస్ వంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండేలా మహిళల భద్రత విషయంలో చర్యలు తీసుకుంటామని అఖిలేశ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలను ఇవ్వలేక పోయారని, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని అఖిలేష్ ఇప్పటికే అనేకసార్లు ఆరోపించారు. అంతేగాక తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువత, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అంతేగాక పార్టీ ప్రత్యేకంగా మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఎస్పీ వర్గాలు తెలిపాయి. మధ్య తరగతి యువతకు ఉపాధి కల్పించడం, వారి విద్య, రైతుల సాగు ఖర్చు తగ్గించడం, మహిళల భద్రతకు సంబంధించిన తదితర అంశాలపై తమ పార్టీ దృష్టి సారించిందని పేర్కొంటున్నారు. ఈ అంశాలే తమ మేనిఫెస్టోలో ప్రతిబింబిస్తాయని వెల్లడిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువ ఓటుబ్యాంకును తమవైపు ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. గతంలో 2012లో అధికారంలోకి వచ్చినప్పుడు సైతం కేవలం 29.15 శాతం ఓట్లను మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ రాబట్టుకోగలిగింది. అయితే ఆ తర్వాత 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రం లోని ఓబీసీ ఓటుబ్యాంకును తమవైపు ఆకర్షించుకోవడం ద్వారా 39.67 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో వివిధ సమీకరణాల ద్వారా ఓటుబ్యాంకును పెంచుకోవడం ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్న ఎస్పీ ఇప్పటికే బీఎస్పీ సంప్రదాయ ఓటుబ్యాంకును ఎస్పీ తమవైపు లాక్కొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మధ్యతరగతి, అట్టడుగు వర్గాల నాయకులు పార్టీలో చేరుతున్న ఈ సమయంలో, పార్టీ తమ సంప్రదాయ ఓటుబ్యాంకు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
– సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment