
బేతపూడి ప్రతాపచంద్ర ముఖర్జీ , ప్యారీ బేగం
సాక్షి, ఏలూరు: గెలుస్తామనే ధీమాతో ఎన్నికల బరిలో నిలిచారు. గడపగడపకు తిరిగి తమకు ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా కోరారు. సీఎం జగనన్న మీద నమ్మకంతో జనాలు వారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ దురదృష్టం కోవిడ్ రూపంలో వారిని కాటేసింది. ఫలితాలు వెలువడటానికి ముందే వారు మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడి మృతి చెందారు. 45వ డివిజన్ నుంచి పోటీచేసిన బేతపూడి ప్రతాపచంద్ర ముఖర్జీ 1058, 46వ డివిజన్ నుంచి పోటీ చేసిన ప్యారీ బేగం 1232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కాగా, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి విజయంతో నగర పీఠాన్ని దక్కించుకుంది. 50 డివిజన్లకు గాను 47 డివిజన్లలో అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందగా టీడీపీ కేవలం మూడు డివిజన్లకే పరిమితమైంది. జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఉనికి కోల్పోయాయి. ఎన్నికలు ముగిసిన ఐదు నెలల తర్వాత ఆదివారం నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment