సోమన్నకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మధుసూదనాచారి, చిత్రంలో బాల్క సుమన్, దేశపతి శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ‘ఎవరి పాలైందిరో తెలంగాణ అని పాట రాసి, పాడితే కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యిందే తప్ప..పదేళ్లయినా తెలంగాణకు ప్రత్యామ్నాయం రాలేదు. తెలంగాణ ఎవరి పాలయిందంటే బరాబర్ కేసీఆర్ పాలైంది. కేసీఆర్ పాలే కావాలి’అని ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ నేతలు మధుసూదనాచారి, దేశప తి శ్రీనివాస్, బాల్క సుమన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ఏ పార్టీ అయినా.. ఏ జెండా అయినా ప్రజల ఎజెండానే ముఖ్యమన్నారు. రాష్ట్రం వచ్చే ముందే తెలంగాణభవన్‌కు దూరమయ్యానని, పదేళ్ల తర్వాత తిరిగి సొంతింటికి వచ్చినట్టు ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రామన్న (కేటీఆర్)ను సోమన్న కలిస్తే ఏదో జరిగిపోయింది అన్నట్టు చూస్తున్నారని, సోమన్నకు వాస్తవం తెలిసి బీఆర్‌ఎస్‌లోకి తిరిగి వచ్చారన్నారు.
ఒక పార్టీ కుమ్ములాట పార్టీ అయితే మరోపార్టీ చెట్టు ఎక్కించి చేతులు ఇడిసినట్టు వదిలేసిందని తెలిపారు. సాయి చంద్ కుటుంబాన్ని పార్టీ ఆదుకున్న తీరు ప్రశంసలు పొందిందన్నారు. ఉద్యమాల నుంచి వచ్చిన కవులు, గాయకులను శాసనమండలిలో కూర్చోబెట్టిన పార్టీ బీఆర్‌ఎస్ అని.. ఈ పార్టీలో హంతక రాజకీయాలు లేవని తెలిపారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ హరీశ్‌రావు, కేటీఆర్, కవితలు ఇతర పనుల్లో బిజీగా ఉండడం వల్ల సోమన్న చేరిక కార్యక్రమానికి రాలేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment