epuri Somanna
-
తెలంగాణ కేసీఆర్ పాలే అయ్యింది.. కావాలె కూడా..
సాక్షి, హైదరాబాద్: ‘ఎవరి పాలైందిరో తెలంగాణ అని పాట రాసి, పాడితే కొంతమందికి ఎంటర్టైన్మెంట్ అయ్యిందే తప్ప..పదేళ్లయినా తెలంగాణకు ప్రత్యామ్నాయం రాలేదు. తెలంగాణ ఎవరి పాలయిందంటే బరాబర్ కేసీఆర్ పాలైంది. కేసీఆర్ పాలే కావాలి’అని ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, దేశప తి శ్రీనివాస్, బాల్క సుమన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ఏ పార్టీ అయినా.. ఏ జెండా అయినా ప్రజల ఎజెండానే ముఖ్యమన్నారు. రాష్ట్రం వచ్చే ముందే తెలంగాణభవన్‌కు దూరమయ్యానని, పదేళ్ల తర్వాత తిరిగి సొంతింటికి వచ్చినట్టు ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రామన్న (కేటీఆర్)ను సోమన్న కలిస్తే ఏదో జరిగిపోయింది అన్నట్టు చూస్తున్నారని, సోమన్నకు వాస్తవం తెలిసి బీఆర్ఎస్లోకి తిరిగి వచ్చారన్నారు. ఒక పార్టీ కుమ్ములాట పార్టీ అయితే మరోపార్టీ చెట్టు ఎక్కించి చేతులు ఇడిసినట్టు వదిలేసిందని తెలిపారు. సాయి చంద్ కుటుంబాన్ని పార్టీ ఆదుకున్న తీరు ప్రశంసలు పొందిందన్నారు. ఉద్యమాల నుంచి వచ్చిన కవులు, గాయకులను శాసనమండలిలో కూర్చోబెట్టిన పార్టీ బీఆర్ఎస్ అని.. ఈ పార్టీలో హంతక రాజకీయాలు లేవని తెలిపారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ హరీశ్‌రావు, కేటీఆర్, కవితలు ఇతర పనుల్లో బిజీగా ఉండడం వల్ల సోమన్న చేరిక కార్యక్రమానికి రాలేదని వివరించారు. -
బీఆర్ఎస్లోకి గాయకుడు ఏపూరి సోమన్న
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలిశారు. ఉద్యమంలో కలసి పనిచేసిన రీతిలోనే బీఆర్ఎస్ వెంట నిలిచేందుకు సోమన్న సుముఖత వ్యక్తం చేయగా.. కేటీఆర్ స్వాగతించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సోమన్న గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. కేటీఆర్ తనను పార్టీలోకి స్వాగతించారని, కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని హామీ ఇచ్చారని ఏపూరి సోమన్న ‘సాక్షి’కి వెల్లడించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ఉద్యమంలో భాగమైన తరహాలోనే అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సాయిచంద్ లేని లోటు పూడ్చేందుకే? బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగానికి వెన్నెముకగా పనిచేసిన కవి, గాయకుడు సాయిచంద్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభలు, సమావేశాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను సాయిచంద్ ముందుండి నడిపించేవారు. ఆయన లేని లోటును పూడ్చేందుకు.. జనాలను ఆకట్టుకునే శక్తి ఉన్నందుకే సోమన్నను చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మొగ్గు చూపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార సభల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు సోమన్న నేతృత్వం వహించే అవకాశం ఉందని అంటున్నాయి. బీఆర్ఎస్లోకి బీజేపీ హైదరాబాద్ నేతలు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, కార్పొ రేటర్‌గా పనిచేసిన వెంకట్‌రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ పద్మ శుక్రవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
TS: బీఆర్ఎస్లోకి ప్రజాగాయకుడు సోమన్న
సాక్షి, హైదరాబాద్: వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఝలక్ ఇస్తూ.. ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరున్నారు. ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖరారు అయ్యింది. ఈ మేరకు చేరికకు ముందర ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును మర్యాదపూర్వకంగా కలిశారాయన. సోమన్నను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేటీఆర్.. సదరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్ల కిందట ఆయన వైఎస్సార్టీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన షర్మిల వెంట నడుస్తూ వస్తున్నారు. ఏపూరి సోమన్న నిన్నటి దాకా వైఎస్సార్టీపీ తరపున తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్టీపీకి ఝలక్ ఇస్తూ.. టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ సమక్షంలో ఇవాళ కేటీఆర్‌ను కలిశారు. సోమన్న అంతకు ముందు ఆయన కాంగ్రెస్‌లోనూ పని చేశారు. ఆ టైంలో రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నడుచుకున్నారు. రేవంత్ పాదయాత్రలోనూ పాల్గొని సోమన్న తన గళం వినిపించారు. కాంగ్రెస్‌ను వీడి.. వైఎస్సార్ టీపీలో చేరే సమయంలో ‘‘నియంతృత్వ భావజాలం ఉన్న ప్రభుత్వాన్ని(బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి..) ఎదుర్కొనేందుకే వైఎస్సార్ టీపీలో చేరుతున్నాన’’ని ప్రకటించారాయన. ఇక సోమన్న పాటలకు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. -
ఆ పాటకు 20 ఏళ్లు
జగద్గిరిగుట్ట: ప్రజా కళాకారుడు, బహుజన యుద్ధనౌక ‘ఏపూరి సోమన్న’ కళాకారుడిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేని పేరు. రాష్ట్రంలోని ప్రతి పల్లెను తన పాటతో చైతన్యం చేస్తున్న ఆ గొంతు ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమన్న అభిమానులు, శ్రేయోభిలాషులు ‘ఇరవై ఏళ్ల పాటల ఊట’ పుస్తకావిష్కరణ సభను గురువారం జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పల్లె పల్లెకు తిరిగి ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ప్రజా పోరాటాలే తన పాటకు ఊపిరిగా జీవిస్తున్న ఏపూరి సోమన్న బుధవారం ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు సోమన్న మాటల్లోనే.. ‘నా 14వ ఏట తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో ‘పల్లె నా పల్లె తల్లి.. నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్లుంద’నే పాట పాడాను. పాఠశాల అనంతరం పశువుల దగ్గరకు వెళ్లినప్పుడు, పొలాల దగ్గర పాట పాడడం ఓ అలవాటుగా మారిపోయింది. నాకు, నా పాటకు మారోజు వీరన్న స్ఫూర్తి, ఆయన మాటలు, పాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు ఏకలవ్య శిష్యుడిని. ఆయన పాటలను టేప్ రికార్డుల్లో వింటూ పాటలు నేర్చుకున్న రోజులున్నాయి. కళాకారుడిగా ప్రజా చైతన్య పాటలు పాడడం మొదలు పెట్టినప్పటి నుంచి నాపై నిర్బంధాలు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. అంతేకాదు.. వరంగల్, నల్లగొండ, సూర్యాపేటల్లో జైలు జీవితం కూడా గడిపాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాక కూడా నాపై నిర్బంధాలు తప్పడం లేదు. బతుకంతా కష్టాలు..కన్నీళ్లు.. ప్రజల పక్షాన నిలబడి పాటలు పాడడం మొదలు పెట్టాక నాకంటూ ఏమీ లేదు. కడుపు నిండా దుఖం ఉంది.. ప్రజల కోçసం పాడుతున్న పాటల్లో అవన్నీ మరిచిపోతున్నా. నా పాటకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ఎనలేని సంతోషం కలుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో నన్ను సంస్కృతి కళామండలికి ఎంపిక చేశారు. కానీ ప్రజల కోసం ఆ అవకావాన్ని వదులుకున్నాను. అమర వీరుల త్యాగలకు ప్రస్తుతం గుర్తింపు లేకుం డా పోయింది. అయితే, ఎన్ని కష్టాలు వచ్చినా పాటను వదిలేయలన్న ఆలోచన కలలో కూడా రాలేదు.. ఎప్పుడూ రాదు. నా బాల్యంలోనే తల్లితండ్రులు దూరమయ్యారు. ఒంటరి నా జీవితంలో పాటే తోడైంది. ఈ పాటే ప్రపంచ పటంపై నన్ను నిలబెట్టింది. అలాంటి పాటను ప్రాణం పోయేంత వరకు వదిలి పెట్టను. ఎందుకంటే పాటతోనే నాకు గుర్తింపు వచ్చింది. కోటీశ్వరులను కూడా పక్కన వీధిలోని వారు గుర్తు పట్టలేరు. కానీ కూటికి లేని నన్ను రోడ్డు మీదకు వస్తే ప్రతి ఒక్కరూ గుర్తు పడతారు. నాతో సెల్ఫీలు దిగేందుకు ఇష్ట పడతారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే గుర్తింపు ఇంకేం కావాలి..? నేను పాడిన ప్రతి పాటా నాకు గుర్తింపు తెచ్చింది. అందులో ‘ఎవడి పాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ’.. పాట మరింతగా పేరు తెచ్చిపెట్టింది’ అంటూ ముగించారు. -
సోమన్నపై కక్ష సాధింపు సరికాదు: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నను అరెస్టు చేయడం సరికాదని, ఆయనపై కక్ష సా«ధింపు చర్యలను నిలిపివే యాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే వారిపై దాడులు పెరిగాయని అన్నారు. సోమన్నను అరెస్టు చేసి స్టేషన్లో పంచాయతీ పెట్టడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు కనిపిస్తోందని, స్టేషన్లో కూర్చోబెట్టి బేడీలు వేసేంత తప్పు ఏంచేశారని ప్రశ్నించారు. -
ప్రశ్నించడమే తప్పా: రేవంత్
సాక్షి,హైదరాబాద్:పాలకుల అకృత్యాలను ప్రశ్నించే గొంతులను నులిమేసేలా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దళితులు, గిరిజన, బలహీన వర్గాల పోరాటంతో వచ్చిన తెలంగాణలో ఆ వర్గాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆర్మూరు, సిరిసిల్ల, ఖమ్మంలో దళితులపై జరిగిన దాడి మరిచిపోకముందే ఏపూరి సోమన్న విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. పాలకులను ప్రశ్నిస్తూ గొంతెత్తడమే ఏపూరి చేసిన నేరమా అని ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన పోలీసులు, టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. -
ఏపూరిపై నిర్బంధం తగదు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్నను నిర్బంధించి బేడీలు వేయడం ప్రభుత్వ దమనకాండకు పరాకాష్టని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అరెస్టు చేస్తే పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే భార్య ఎందుకున్నట్లని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, దళితులపై దాష్ఠీకాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.