ఆ పాటకు 20 ఏళ్లు | Epuri Somanna Book Release | Sakshi
Sakshi News home page

ఆ పాటకు 20 ఏళ్లు

Apr 25 2019 7:48 AM | Updated on Apr 25 2019 7:48 AM

Epuri Somanna Book Release - Sakshi

జగద్గిరిగుట్ట: ప్రజా కళాకారుడు, బహుజన యుద్ధనౌక ‘ఏపూరి సోమన్న’ కళాకారుడిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేని పేరు. రాష్ట్రంలోని ప్రతి పల్లెను తన పాటతో చైతన్యం చేస్తున్న ఆ గొంతు ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమన్న అభిమానులు, శ్రేయోభిలాషులు ‘ఇరవై ఏళ్ల పాటల ఊట’ పుస్తకావిష్కరణ సభను గురువారం జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పల్లె పల్లెకు తిరిగి ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ప్రజా పోరాటాలే తన పాటకు ఊపిరిగా జీవిస్తున్న ఏపూరి సోమన్న బుధవారం ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించారు.

ఆ వివరాలు సోమన్న మాటల్లోనే..  
‘నా 14వ ఏట తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో ‘పల్లె నా పల్లె తల్లి.. నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్లుంద’నే పాట పాడాను. పాఠశాల అనంతరం పశువుల దగ్గరకు వెళ్లినప్పుడు, పొలాల దగ్గర పాట పాడడం ఓ అలవాటుగా మారిపోయింది. నాకు, నా పాటకు మారోజు వీరన్న స్ఫూర్తి, ఆయన మాటలు, పాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు ఏకలవ్య శిష్యుడిని. ఆయన పాటలను టేప్‌ రికార్డుల్లో వింటూ పాటలు నేర్చుకున్న రోజులున్నాయి. కళాకారుడిగా ప్రజా చైతన్య పాటలు పాడడం మొదలు పెట్టినప్పటి నుంచి నాపై నిర్బంధాలు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. అంతేకాదు.. వరంగల్, నల్లగొండ, సూర్యాపేటల్లో జైలు జీవితం కూడా గడిపాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాక కూడా నాపై నిర్బంధాలు తప్పడం లేదు.  

బతుకంతా కష్టాలు..కన్నీళ్లు..
ప్రజల పక్షాన నిలబడి పాటలు పాడడం మొదలు పెట్టాక నాకంటూ ఏమీ లేదు. కడుపు నిండా దుఖం ఉంది.. ప్రజల కోçసం పాడుతున్న పాటల్లో అవన్నీ మరిచిపోతున్నా. నా పాటకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ఎనలేని సంతోషం కలుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో నన్ను సంస్కృతి కళామండలికి ఎంపిక చేశారు. కానీ ప్రజల కోసం ఆ అవకావాన్ని వదులుకున్నాను. అమర వీరుల త్యాగలకు ప్రస్తుతం గుర్తింపు లేకుం డా పోయింది. అయితే, ఎన్ని కష్టాలు వచ్చినా పాటను వదిలేయలన్న ఆలోచన కలలో కూడా రాలేదు.. ఎప్పుడూ రాదు. నా బాల్యంలోనే తల్లితండ్రులు దూరమయ్యారు. ఒంటరి నా జీవితంలో పాటే తోడైంది. ఈ పాటే ప్రపంచ పటంపై నన్ను నిలబెట్టింది. అలాంటి పాటను ప్రాణం పోయేంత వరకు వదిలి పెట్టను. ఎందుకంటే పాటతోనే నాకు గుర్తింపు వచ్చింది. కోటీశ్వరులను కూడా పక్కన వీధిలోని వారు గుర్తు పట్టలేరు. కానీ కూటికి లేని నన్ను రోడ్డు మీదకు వస్తే ప్రతి ఒక్కరూ గుర్తు పడతారు. నాతో సెల్ఫీలు దిగేందుకు ఇష్ట పడతారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే గుర్తింపు ఇంకేం కావాలి..? నేను పాడిన ప్రతి పాటా నాకు గుర్తింపు తెచ్చింది. అందులో ‘ఎవడి పాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ’.. పాట మరింతగా పేరు తెచ్చిపెట్టింది’ అంటూ ముగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement