సాక్షి, హైదరాబాద్: తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ పుస్తకం "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" అనే పుస్తకాన్ని ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం హై కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సత్యప్రియ బిఎన్‌లు కలిసి రచించారు.
ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఇందులో ప్రధానంగా తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అలాంటి తప్పుడు సమాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి ? దానికోసం మనం తెలుసుకోవాల్సిన అంశాలపై "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" పుస్తకం అద్భుతమైన అవగాహన కల్పిస్తుంది.
ఈ సందర్భంగా జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో, వాస్తవాలను తనిఖీ చేసే ఒక వ్యవస్థను కలిగి ఉండటం ఎంతో అవసరమని, దీంతో ఆసక్తి ఉన్నవారందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏ ఒక్కరినో శక్తివంతం చేయకుండా వ్యవస్థ సమతుల్యంగా నడవాలి కాబట్టి ప్రతి ప్రొఫెషనల్, ప్రతి కార్యాచరణకు కొంత బాధ్యత ఉండాలని సూచించారు.
తప్పుడు రిపోర్టింగ్, తప్పుడు సమాచారంతో బాధితులు మనోవేదనకు గురవుతున్నారని, ఈ ఫ్యాక్ట్ చెక్ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఫ్యాక్ట్ చెక్‌ను ఒక మధ్యవర్తిత్వ వ్యవస్థగా భావిస్తున్నానన్నారు. ఈ పుస్తకం పోలీసు, న్యాయస్థానాల వంటి వ్యవస్థల మధ్య, మధ్యవర్తులు అందుబాటులో ఉంటే, అది బాధితునికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
అనంతరం ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ కె.స్టీవెన్‌సన్ మాట్లాడుతూ.. అసలు తప్పుడు సమాచారం ఎలా ఉద్భవిస్తుంది ? ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాముఖ్యత ఏమిటి ? తప్పుడు సమాచారాన్ని కనుగొనేందుకు వాడే టూల్స్ గురించి, ఇమేజ్, టెక్ట్స్, వీడియో వెరిఫికేషన్ వంటి అంశాలపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment