61 సీట్లపైనే గెలుస్తాం | Etela Rajender Comments on BRS And Congress Party | Sakshi
Sakshi News home page

61 సీట్లపైనే గెలుస్తాం

Published Tue, Nov 7 2023 2:18 AM | Last Updated on Tue, Nov 7 2023 10:13 AM

Etela Rajender Comments on BRS And Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల కన్నా ఎక్కువ మెజారిటీని బీజేపీ గెలుచుకుంటుందని రాష్ట్ర బీజేపీ ఎన్నికల కార్యనిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. అయితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తరహాలో 119 నియోజకవర్గాల్లోనూ బలంగా ఉన్న ‘సెటిల్డ్‌’పార్టీ బీజేపీ కాదన్నారు.

టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్‌లో ఈటలతో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమం జరిగింది. టీయూడబ్లు్యజే రాష్టప్రదాన కార్యదర్శి విరాహత్‌ అలీ, ఐజేయూ ప్రధాన కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈటల రాష్ట్రంలో బీజేపీకి ఉన్న అనుకూలాంశాలను, కేసీఆర్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

మూలమైన అంశాలు మూలకు.. 
తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియా మకాలు అనే అంశాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించింది. అన్ని పనులు ఆపి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒనగూరిన ప్రయోజనం లేకపోగా ప్రాజెక్టు పునాదులే కదిలాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలతో మొత్తం ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకమైంది.

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక అప్పటి వరకు ఉన్న రూ. 74 వేల కోట్ల అప్పును రూ. 5.5 లక్షల కోట్లు చేశారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. 17 పోటీ పరీక్షలు నిర్వహిస్తే అన్నీ లీక్‌ అయ్యాయి. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, వడ్డీలేని రుణాలు, రుణమాఫీలన్నీ అటకెక్కాయి. పేదలకు భూములు ఇవ్వకపోగా ఎన్నో ఏళ్ల కింద దళితులకు ఇచి్చన ప్రభుత్వ, దేవాలయ భూములు సేకరిస్తున్నారు. గజ్వేల్‌లో 30 వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వారంతా కేసీఆర్‌ బాధితుల సంఘానికి నన్ను అధ్యక్షుడిగా చేసుకున్నారు. 

హంగ్‌వస్తే కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ ఒకటవుతాయి
బీఆర్‌ఎస్‌తో బీజేపీ జట్టు కట్టిందని.. ఆ రెండు పార్టీలు ఒకటేనని మాపై ఒక వదంతి పుట్టించారు. రెండు పార్టీలు ఒకటి అయితే నేను గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఎందుకు పోటీ చేస్తా? టీఆర్‌ఎస్‌ గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది తప్ప బీజేపీతో ఎప్పుడూ పొత్తులేదు. ఒకవేళ రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒకటవుతాయి తప్ప కాంగ్రెస్, బీజేపీ కలుస్తా యా? 2014లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలంతా మూ కుమ్మడిగా బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో 19 మందిని గెలిపిస్తే 13 మంది శాసనసభ్యులు కేసీఆర్‌ పంచన చేరారు. బీజేపీ మాత్రమే కేసీఆర్‌ను నివారించగలదు. మోదీ పాలనలో స్కాం లేదు. దేశ ఆత్మగౌరవం పెరిగింది. 

సెటిల్డ్‌ పార్టీ కాదు బీజేపీ.. 
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్‌గా లేదు. జనసేనతో మాకు అవసరం ఉంది కాబట్టే పొత్తు పెట్టుకున్నాం. 8 సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తరహాలో ‘సెటిల్డ్‌’ పార్టీ కాదు. అందుకే నాయకులు వస్తుంటారు... పోతుంటారు. బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్టీలు ఎందుకు నాయకులను చేర్చుకుంటున్నాయి? కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, జీహెచ్‌ఎంసీలలో బీజేపీ సంపూర్ణంగా బలంగా ఉంది. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కొంత మేరకే ప్రభావం చూపుతాం. మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్‌ మొదలైన మిగతా జిల్లాల్లోనూ బలం పెరిగింది. ఈ లెక్కన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్లకన్నా ఎక్కువే సాధిస్తాం.

బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీ 
బీఆర్‌ఎస్‌ ఉన్నంతకాలం కేసీఆర్‌ కుటుంబమే ముఖ్యమంత్రి పదవి చేపడుతుంది. 1947 నుంచి ఇప్పటివరకు తెలుగునాట బీసీ సీఎం లేరు. జనాభాలో 52 శాతం ఉన్నా పరిపాలన అందని ద్రాక్షే. అందుకే బీజేపీ బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటిస్తే.. రాహుల్‌ గాంధీ విమర్శిస్తున్నారు. దేశంలో బీసీలకు అవకాశాలు కల్పించిందే బీజేపీ. కేంద్ర కేబినెట్‌లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. నేడో రేపో బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement