సాక్షి, తాడేపల్లి: ఏపీలో సీఎం చంద్రబాబు రాజ్యాంగం నడుస్తోంది. ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే నెపంతో దాడులు చేయడం సరికాదన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. నచ్చిన వారికి పేదవాడు ఓటు వేయడమే శాపంగా మారినప్పుడు వారి ఓటు హక్కును రద్దు చేయండని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, నారాయణ స్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోటీచేసిన అభ్యర్థులను కాల్చేయండి. ఎందుకంటే మాకు ఓటు వేయడమే ప్రజలు వేసిన పెద్ద నేరం. అందుకే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. అలా కాకుండా మమ్మల్ని చంపేస్తే వచ్చే ఎన్నికల్లో మీకు పోటీ ఎవరూ ఉండరు. అప్పుడు సునాయాసంగా మీరు ఎన్నికల్లో గెలవచ్చు.
దేశంలో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. కేంద్రంలో మోదీ రాజ్యాంగం, రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యాంగమే నడుస్తోంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో కులం, మతం, వర్గం, లింగ వివక్ష అనే తేడా లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ ఆత్మ నేడు ఘోషిస్తూ ఉంటుంది. పేదవాడు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం నేరమా?. మాకు ఓటు వేస్తే దాడులు చేయడం ఎంత వరకు కరెక్ట్?. అందుకే పేదవారికి ఉన్న ఓటు హక్కును రద్దు చేయండి. ఎలాగో మీరు అన్ని చట్టాలు మారుస్తున్నారు కదా.
ఇకనైనా ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలపై దాడిని ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన నేతలు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి. మీకు సహకారం అందిస్తాం. అంతేకానీ, ఇలా దాడి చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. ముందు.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అంటూ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment