రేవంత్‌.. నీకు చాతనైతే టీడీపీ, కాంగ్రెస్‌ను తిట్టాలి: హరీష్‌రావు | Ex Minister Harish Rao Serious Comments On CM Revanth Reddy Over His Speech In Palamuru, Details Inside - Sakshi
Sakshi News home page

రేవంత్‌.. నీకు చాతనైతే టీడీపీ, కాంగ్రెస్‌ను తిట్టాలి: హరీష్‌రావు

Published Thu, Mar 7 2024 2:15 PM | Last Updated on Thu, Mar 7 2024 5:00 PM

Ex Minister Harish Rao Serious Comments On CM Revanth - Sakshi

సాక్షి, సంగారెడ్డి: టీడీపీ అధినేత చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్‌ పార్టీ లోపాలే పాలమూరు పాలిట శాపాలుగా మారాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. పాలమూరు వలసలకు కారణం టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలే కారణమని ఆరోపించారు. 

కాగా, హరీష్‌ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే. ఇప్పుడు రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలి. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయి. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలే.

గత పార్టీల నాయకులు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదు. మేము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. అలాంటి కేసీఆర్‌ను రేవంత్ తిట్టడం అవివేకం. ముఖ్యమంత్రి మాట్లాడే భాషతో, పరుష పదజాలంతో పరిపాలన సాగదు. ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దు. ఎంత ఎత్తులో ఉన్నామన్నది కాదు, ప్రజలకు ఎంత మంచి చేశామన్నది ముఖ్యం.

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం రేవంత్‌ చేస్తున్నాడు. పదేళ్లు చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. తన తండ్రి చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లినా అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా?. పాలమూరు కరువుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టీడీపీ పార్టీలే. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు.

1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ, మేము బాగు చేసి నీళ్లు ఇచ్చాము. ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం. వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీనే. వాస్తవాలు కప్పి పెట్టి కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు 80శాతం అయ్యింది. కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇవ్వండి. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే ప్రయత్నం సరికాదు. ఓట్లు, సీట్లే కాదు నిజాయతీగా పని చేయాలి’ అని వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement