సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఇవ్వాలని అంటున్నారు.. రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా? అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రైతు భరోసా (Rythu Bharosa) కింద రైతులకు ఇవ్వలేదు.. రైతు యాచించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందంటూ ధ్వజమెత్తారు. మొన్నటి వరకు కుల గణన డ్రామా చేశారని దుయ్యబట్టారు.
‘‘ఊరూరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ పత్రం ఇవ్వాలి. ఏ ఊళ్లో ఎంత రుణమాఫీ చేశారో లిస్ట్ బయటపెట్టాలి. ఏ ఊళ్లో ఎంతమందికి బోనస్ ఇచ్చారో డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ ఊళ్లో రైతు కూలీలకు ఎంత బాకీ పడ్డావో ఆ లిస్ట్ కూడా బయటపెట్టాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుక్కను చంపే ముందు పిచ్చిదని ముద్ర వేయాలని.. రైతు బంధు పథకాన్ని కూడా బొందపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు. రూ.22 వేల కోట్లు ఎక్కడ దారి మళ్లాయో లిస్ట్ బయటపెట్టాలి. ఈ ప్రభుత్వం పచ్చి దొంగ మాటలు మాట్లాడుతోంది. ఈ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలి. ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగండి.
..ఒక్కొక్క రైతుకు, ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తం 17,500, ఊరూరా పోస్టర్లు వేసి మరీ రైతులకు తెలిసేలా చేస్తాం. రైతు బంధును లేకుండా చేయాలనే చిల్లర ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు. రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడుక్కుంటారా అని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వ ధోరణి ఆలోచన చాలా దారుణంగా ఉంది’’ అని కేటీఆర్ నిలదీశారు.
ఇదీ చదవండి: రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తులు!
‘‘రేపటి(శనివారం) నుండి రైతులను చైతన్య పరుస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. వరుసగా 11 సార్లు రైతులకు సమయానికి రైతు భరోసా కేసీఆర్ ప్రభుత్వం వేసింది. రూ.73 వేల కోట్లు రైతు భరోసా కింద రైతులకు నేరుగా వేశాము. ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద వేయలేదు. కాంగ్రెస్ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరుతొ బిల్డప్ ఇచ్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది? వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ప్రజా పాలన కింద కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ డిటైల్స్ అన్ని ప్రభుత్వం దగ్గర వున్నా.. మళ్లీ ప్రమాణ పత్రాలు ఎందుకు??
రైతులు ఏ పంట వేసారో అని ప్రమాణ పత్రం ఇవ్వాలని ఈ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది.. ప్రమాణ పత్రాలు ఎవ్వరూ ఇవ్వాలి .. ఈ ప్రభుత్వం ప్రమాణ పత్రాలు ఇవ్వాలి. కౌలు రైతులకు , భూ రైతులకు రైతు భరోసా ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. 22 వేల కోట్లు దుర్వినియోగం అని దొంగ మాటలు ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. 22 వేల కోట్ల నిధులు ఎక్కడికి వెళ్ళాయో ఈ ప్రభత్వం చెప్పాలి.. చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా ??’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment