సాక్షి, తాడేపల్లి: పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామస్మరణే చేశారు. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని వ్యాఖ్యలు చేశారు.
కాగా, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు, పవన్‌కు పట్టదు. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేరు. పవన్ సినిమా డైలాగ్‌లు బట్టీ కొట్టారు. సినిమా వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదివారు. నాడు అమరావతి.. ఒక కులానికే రాజధాని అని పవన్ అన్నారు. అమరావతి అందరికీ రాజధాని కాదు.. అది కొందరి రాజధానే అని పవన్ గతంలో ఎందుకన్నారు. ఆరోజుకు.. ఈరోజుకు.. అమరావతి విషయంలో ఏం మార్పు జరిగిందో పవన్ చెప్పాలి.
నీకు చేతనైంది చేసుకో..
ముఖ్యమంత్రి జగన్ దగ్గర బేరాలు ఉండవమ్మా.. పవన్‌కు చేతనైంది చేసుకోవచ్చు. నువ్వు 24 కాకపోతే.. నాలుగో, రెండో.. ఎన్ని సీట్లు తీసుకుంటే మాకెందుకు బాధ. వైఎస్సార్‌సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2014, 2019 ఎన్నికల్లో కూడా పవన్.. జగన్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు మూడో జెండా కోసం ఎదురుచూస్తున్నారు. నీ చేష్టల వల్ల పవన్‌కు ఓటేద్దామనుకున్న కాపులు బాధపడతారు. పవన్‌కు చేతనైతే సీఎం జగన్‌పై చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలి. సీఎం జగన్ గురించి టన్నుల టన్నుల సమాచారం ఉందంటున్న పవన్ ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు.
పవన్ ఓ శిఖండి..
పవన్ ఆయన గురించి ఆయనే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి. పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉంది. పవన్ వామనుడు కాదు శల్యుడు, శిఖండిలాంటివాడు. పార్టీని, పార్టీ నేతల్ని అందరినీ శల్యుడిలా పవన్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. చంద్రబాబు.. పవన్‌ను ఒక్కమాట కూడా అనలేదు. నన్ను జైలులో పెడితే.. పవన్ వచ్చి మా పార్టీని బతికించారని చంద్రబాబు అన్నారా?. పవన్ సభలో అన్నీ సొల్లు కబుర్లే. పవన్ తనను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచుతున్నారు. ప్రజా జీవితంలో ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ప్రశ్నిస్తారు. 2024లో చంద్రబాబు, పవన్ జెండాలను ప్రజలు మడతేస్తారు. చంద్రబాబు కోసం నాలుక మడతేసిన వ్యక్తి పవన్ కల్యాణ్.
వివేకాను హత్య చేసిన ముద్ధాయి టీడీపీ జెండా మోస్తున్నాడు. హు కిల్డ్ ఎన్టీఆర్.. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ పని. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం ఎంత కష్టమో.. పవన్‌ను నమ్ముకుని రాజకీయం చేయడం కూడా అంతే. ప్రశ్నిస్తానన్న పవన్.. చంద్రబాబును ఎప్పుడు ప్రశ్నించారు. నువ్వు ఎన్ని సీట్లు అయినా తీసుకో.. కానీ, దానిపై సమాధానం చెప్పుకోవాల్సింది నీ అభిమానులకు, కార్యకర్తలకు మాకు, వైఎస్సార్‌సీపీకి కాదు’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment