ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత హింస జరుగుతోంది: పేర్ని నాని | Ex Minister Perni Nani Serious On TDP Govt And Red Book Politics | Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత హింస జరుగుతోంది: పేర్ని నాని

Published Mon, Aug 5 2024 4:25 PM | Last Updated on Mon, Aug 5 2024 5:00 PM

Ex Minister Perni Nani Serious On TDP Govt And Red Book Politics

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకు పెరుగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. అలాగే,  పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరో తెలిసిప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పడం లేదన్నారు. 

కాగా, మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎప్పుడూ ఇటువంటి ఘటనలు జరగలేదు. ఏపీలో రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతున్నాయి. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వ ప్రేరేపిత హింసలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసుల కళ్ల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కుట్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చంపుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేయడం లేదు.

ప్రాణహాని ఉందని చెప్పినా ఏ మాత్రం స్పందించడం లేదు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతున్నారు. ఏపీలో విచిత్రమైన పోలీస్‌ వ్యవస్థ ఉంది. రాజకీయ హత్యలను దుండగులు చంపేశారని ప్రచారం చేస్తున్నారు. సీతారామపురంలో అమాయకుడిని దారుణంగా హత్య చేశారు. సుబ్బారాయుడు అనే వ్యక్తిని చంపేసినా పట్టించుకోలేదు. తనకు ప్రాణహాని ఉందని నారప్ప రెడ్డి చెప్పినా పోలీసులు స్పందించలేదు. మా కార్యకర్తలను చంపుతుంటే ఈనాడు కూడా వార్తలు రాయడం లేదు. నిందితులు ఎవరో తెలిసిప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పడం లేదు. ఇలాంటి ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనైనా ఉందా?. నడిరోడ్లపై హత్యలు, దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం గాల్లోకి కూడా కాల్పులు జరపలేదు. కళ్ల ముందే మనిషిని చంపుతుంటే పోలీసులు ఆపలేరా? అని ప్రశ్నించారు. 

ఏపీ చరిత్రలో పోలీసుల కొత్త పోకడలు ఇప్పుడు చూస్తున్నాం. బీహార్‌లో ప్రభుత్వ ప్రేరేపిత ఘటనలు జరిగేవి. రాజకీయ నేర సంఘటనలు చూస్తుంటే ఉత్తరాది రాష్ట్రాల తరహా హింస జరుగుతోంది. బీహారులో ప్రస్తుతం శాంతిభద్రతలు అమల్లోకి వచ్చాయి. కానీ ఏపీలో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. పోలీసులు కూడా కూటమి నేతల చేతిలో అగౌరవపడుతున్నారు. కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి పోలీసులే సాక్ష్యంగా మిగిలారు. పోలీసు వ్యవస్థ అంతా పాత డీజీపీ, పాత ఐజీ చేతిలో ఉంది. ఎవర్ని సస్పెండ్ చేయాలన్నా ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా వారిదే పెత్తనం. దేశంలో ఇంత కిరాతకంగా ప్రభుత్వ హింస ఇంకెక్కడైనా జరుగుతుందా?. శాంతిభద్రతల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిలక పలుకులు పలికారు. ఇప్పుడు దారుణాలు జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి యాభై రోజులు దాటినా వారికి రక్తదాహం తీరలేదు. వాలంటీర్లకు పదివేలు ఇస్తానని ఎగ్గొట్టారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్‌ గ్రూపు పెట్టుకోవాలని చంద్రబాబు సూచించడం దేనికి సంకేతం?. 

వైఎస్సార్‌సీపీ హయంలో అందరికీ న్యాయం చేయాలని కలెక్టర్లతో వైఎస్‌ జగన్ చెప్పారు. చంద్రబాబు మాత్రం మాది పొలిటికల్ గవర్నెన్స్ అని బాహాటంగానే చెప్పారు. ఇలాంటి దిక్కుమాలిన దిగజారిన ప్రభుత్వాన్ని ఏపీలో చూస్తున్నాం. మేనిఫెస్టో పథకాల గురించి చంద్రబాబు కలెక్టర్లతో ఎందుకు మాట్లాడరు?. వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలు ఆపకుండా ఇచ్చారు. సోషల్ మీడియాని సర్వనాశనం చేసిందే చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తప్పుడు సమాచారం వస్తే కేసులు పెట్టమంటున్నారు. భట్టిప్రోలులో టీడీపీ నేతలు ఎస్ఐ చొక్కా పట్డుకున్నారు. వైఎస్‌ జగన్ మీద విషం కక్కిన ఎల్లో మీడియా మంచిదంటా?. నిజాలు రాసే సాక్షి మీద కేసులు పెడతారంట. ఖాకీ పౌరుషం తెలుసు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు?. అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలను కొచ్చిన్, ఢిల్లీలో కోర్టులు కూల్చేశాయి. మరి ఆ కోర్టులను కూడా ఎందుకు తప్పు పట్టలేదు?. అసలు చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడం కాదా?. రూల్స్‌కి విరుద్దంగా ఉందని దాన్ని కూల్చడానికి గతంలో మీ ప్రభుత్వమే నోటీసులు ఇచ్చిందా? లేదా?. చివరికి ఆర్మీ జవాను ఇంటిని కూల్చటానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement