కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్
హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది
అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది
రూ.2,500 ఆర్థిక సాయంపై రాహుల్ కూడా అబద్ధాలు చెప్పారు
ప్రధాని మోదీతో తెలంగాణకు పైసా కూడా లాభం కాలేదు
కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి మేలు జరుగుతుంది
ఈ దేశం, ఈ రాష్ట్రం మనది.. అందరం ఏకమై కాపాడుకోవాలి
బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ హక్కుల సాధన సాధ్యమవుతుంది
నర్సాపూర్, పటాన్‌చెరు, దుండిగల్‌లో ఎన్నికల ప్రచారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/దుండిగల్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ప్రతి పథకంలో కొండి పెట్టడం.. తొండి పెట్టడం.. అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి పరిపాటిగా మారిందని అన్నారు. రైతుబంధు ఆర్థిక సాయం తాము అందరికీ ఇస్తే.. కాంగ్రెస్ వ్యవసాయం చేసిన వారికే ఇస్తామంటోందని చెప్పారు.
వరి నాట్లు వేసేటప్పుడు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం.. కోతలు, కల్లాలైనా కూడా ఇవ్వడం లేదన్నారు. వడ్లు కొనడం లేదని, వడ్లకు బోనస్ బోగస్ అయిందని ఎద్దేవా చేశారు. రూ.రెండు లక్షల రుణమాఫీ జరగలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్, పటాన్‌చెరు, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని దుండిగల్‌లో జరిగిన రోడ్ షోల్లో కేసీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కింది
‘నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ ఉచితబస్సు హామీ తప్ప ఏ ఒక్క హామీనీ నెరవేర్చ లేదు. పేదల సంక్షేమం కాంగ్రెస్‌కు పట్టడం లేదు. రైతుబంధు సాయం అందలేదు. ఫ్రీబస్సు పథకం పెట్టి ఆటో కార్మికుల నోళ్లు కొట్టారు. మేము మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ఇస్తే.. ఇప్పుడు ఆ నీళ్లు మాయమైపోయాయి.
మా ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్లు బ్రహా్మండంగా వచ్చిన కరెంట్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎక్కడికి పోయింది? ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇస్తలేరు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్‌లను నిలిపివేశారు. కల్యాణలక్ష్మికి అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదు. రూ.4 వేల పింఛను ఇస్తారనే నమ్మకం ప్రజల్లో లేదు. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం హామీ నెరవేర్చామని రాహుల్ గాంధీ ఇటీవల బహిరంగ సభలో అబద్ధాలు చెప్పారు..’అని కేసీఆర్ విమర్శించారు.
ఏ వర్గాన్నీ పట్టించుకోవడం లేదు
‘టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో గిరిజన రిజర్వేషన్లపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, దానిపై సరైన, గట్టి వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతోంది. మా ప్రభుత్వ హయాంలో గిరిజనుల పోడు భూములకు కూడా రైతుబంధు ఆర్థిక సాయం అందించాం. కానీ ఇప్పుడు రావడం లేదు. నేను 58 ఏండ్లుగా మొత్తుకున్నా ఏ ఒక్క సీఎం కూడా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయలేదు.
మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను పంచాయతీలుగా చేసి నేరుగా నిధులు ఇచ్చాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేవీ రాకుండా చేసింది. ఏ ఒక్క వర్గం కోసం కూడా కాంగ్రెస్ పని చేయడం లేదు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోవడానికి ఆ పార్టీ విధానాలే కారణం. కాంగ్రెస్ విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు ఇక్కడి నుంచి తరలిపోతున్నరు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఆర్‌ఆర్ ట్యాక్స్ చెల్లిస్తున్నాడని స్వయంగా మోదీయే ప్రకటించారు..’అని మాజీ సీఎం చెప్పారు.
పాకిస్తాన్ పేరిట బీజేపీ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్
‘పాకిస్తాన్‌తో పంచాయతీ అంటూ బీజేపీ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ‘బుట్కంత దేశం పాకిస్తాన్.. జాడిచ్చి కొడితే 25 ఏండ్లు మన దిక్కు చూడదు.. ప్రతిసారి పాకిస్తాన్ అని చెప్పుడు.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం.. ఓట్లు దండుకోవడం. ప్రధాని మోదీతో తెలంగాణకు పైసా కూడా లాభం కాలేదు. 150 స్లోగన్లు చెప్పిన మోదీ.. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ అయిందంటున్నరు.. అది కాలేదు కానీ.. దేశం సత్తెనాస్ అయింది.. మోదీ హయాంలో రూపాయి విలువ ఏ ప్రధాని హయాంలో దిగజారనంతగా పడిపోయింది. పెట్టుబడులు పోయాయి.
అంతర్జాతీయంగా భారతదేశ విలువలు మంట గలిసిపోతున్నాయి. విశ్వ గురువుగా ప్రకటించుకున్న మోదీ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత అరెస్టులపై అమెరికా దేశం సైతం తమ నిరసన తెలిపింది. మోదీ ఎజెండాలో పేదల బాధలుండవు. ఢిల్లీలో ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపిన మోదీ.. తర్వాత జరిగిన యూపీ ఎన్నికల్లో క్షమాపణలు చెప్పిండు.
మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఎందుకు చేరిండు?
నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఎందుకు చేరిండని కేసీఆర్ ప్రశ్నించారు. పైసల కోసం చేరిండా? ఎవరిని ఉద్ధరించేందుకు ఆయన కాంగ్రెస్‌లో చేరిండో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. పోలీసులు చాలా అతిగా ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మెదక్, మల్కాజిగిరి బీ ఆర్‌ఎస్ అభ్యర్థులు వెంకట్రామ్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్‌ది మూడో స్థానమే..
ఈ దేశం, ఈ రాష్ట్రం మనది. అందరం ఏకమై తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యువత, మేధావులు ఆలోచన చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలే తప్ప.. ఒక ఒరవడిలో పిచ్చిపిచ్చిగా కొట్టుకుని పోవద్దు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది. అలాంటి కాంగ్రెస్‌కు ఒటేస్తే బీజేపీకి మేలు జరుగుతుంది. బీఆర్‌ఎస్ 12 స్థానాలు గెలిస్తే పార్లమెంట్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.
కృష్ణా, గోదావరి జలాలను తమిళనాడుకు తీసుకెళ్లే ప్రయత్నం మోదీ చేస్తు న్నారు. సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడటం లేదు. ఈ నీళ్లను కాపాడు కోవాలంటే తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలి. అలా అయితే తెలంగాణ హక్కుల సాధన సాధ్యమవుతుందని’ కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment