
సాక్షి,అమరావతి: టీమిండియా క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్
రాజకీయాలు తన సెకండ్ ఇన్నింగ్స్ అని టీమిండియా అంబటి తిరుపతి రాయుడు తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి సీఎం జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబటి రాయుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చాలా ఆరోపణలు చేశారని, అయితే ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశి్నంచారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అంబటి రాయుడు అన్నారు.
యువత ఆకాంక్షలకు అద్దం పడుతున్న రాయుడి అరంగేట్రం
రాజకీయాల్లో నైతిక విలువలకు పట్టం కట్టి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా యువతలో జగన్‌కు మద్దతు నానాటికీ అధికమవుతోంది. పలు సంస్కరణలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దుతుండడం.. విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ భారీ ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుండడమే ఇందుకు నిదర్శనం.
రాజకీయాల్లో నైతిక విలువలకు వలువలు వదిలి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆయనకు వంతపాడుతున్న జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ను మెజార్టీ ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రధానంగా వారిద్దరి రాజకీయ వ్యవహారశైలిపై యువతలో అసహనం పెల్లుబికుతున్నది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి.. వైఎస్సార్‌సీపీలో చేరడం రాష్ట్రంలో యువత ఆకాంక్షలకు అద్దంపడుతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలకక ముందు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికాక అంబటి రాయుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృ తంగా పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనకు ప్రజలు జేజేలు పలుకుతుండడం.. ప్రధానంగా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండడాన్ని గమనించారు. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు యువత ఆకాంక్షలకు అద్దం పడుతూ.. వైఎస్సార్‌సీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.