వికృతానందంతోనే జగన్ పై తప్పుడు కేసు
చట్టపరంగా ఆ కేసును ఎదుర్కొంటాం
రెడ్ బుక్ పాలనని కాదు.. మేనిఫెస్టో అమలు చేయండి
ఫాల్స్ కేసులు రాసే అధికారుల వైఖరి మారాలి
లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు
మేనిఫెస్టో అంశాలను విస్మరిస్తున్న ప్రభుత్వం
ఇప్పటికే ‘తల్లికి వందనం’లో మాట తప్పారు
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, లోకేశ్ రెడ్ బుక్‌లో రాసుకున్న విధంగా కక్ష సాధింపులు, అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస పాలన చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వికృతానందంతోనే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్రమంగా కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని చెప్పారు. ‘రెడ్ బుక్ పాలనని కాదు.. మేనిఫెస్టో అమలు చేయండి’ అంటూ హితవు పలికారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లోకేశ్ ఓ రెడ్‌బుక్‌లో కొందరి పేర్లు రాసి, వారిపై కేసులు పెట్టి తాట తీస్తానని ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడు దాన్ని అమలు చేయడంపైనే ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని అన్నారు.
కీలకమైన పోస్టింగ్‌లు తెచ్చుకొన్న కొందరు పోలీసులు రెడ్ బుక్‌ను అమలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమని, సమాజానికి మంచిది కాదని, అ«ధికారుల వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తప్పులు చేసిన వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయని తెలిపారు. వైఎస్‌ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే సీఎం చంద్రబాబు అడ్డు చెప్పకపోగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు, లోకేశ్, రఘురామ.. ముగ్గురూ కలిసి జగన్‌ని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసు రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా, గత నెల రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచిత్రంగా జగన్‌పై కేసు నమోదు చేశారని అన్నారు. పోలీసు కస్టడీలో రఘురామను టార్చర్ చేయలేదని ఆనాడే వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. అప్పట్లో గుంటూరు కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా రఘురామ ఇప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు.
నాయకుల ఒత్తిడితో ఫాల్స్ కేసులు పెడితే ఆ పాపం ఊరికే పోదని, కబళించేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మేధావులు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైనా రెండు తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. పిన్నెల్లి ఎవరిపైనా దాడి చేయకపోయినా, అసత్య ఆరోపణలతో ఎన్నికలు జరిగిన 10 రోజుల తరవాత కేసులు నమోదు చేశారని చెప్పారు.
సూపర్ సిక్స్ అమలు చేయకపోతే వెంటాడుతాం
ఇంట్లో ఎందరు పిల్లలున్నా అందరికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకంలో ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన టీడీపీ, ఇప్పుడు మాట తప్పి, తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామంటున్నారని అన్నారు. కుటుంబంలో అందరు పిల్లలకు ఆర్థిక సాయం చేసేలా వెంటనే జీవో మార్చాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనంపై విధివిధానాలు ఖరారు కాలేదని చెబుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు ఒకసారి ఆ జీవో చదువుకోవాలని అన్నారు.
ఎన్నికల్లో టీడీపీ ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్‌లో ఇప్పటికే ఒకటి ఫెయిల్ అయిందని, మిగతా వాటిని అమలు చేయకపోతే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని వెంటాడుతామని ప్రకటించారు.జగన్ ప్రజల మనిషిమాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనిషి అని, ఆయన నిత్యం ప్రజలతోనే మమేకమై ఉంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ అని స్పష్టంచేశారు. నాడైనా, నేడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా వైఎస్ జగన్ ప్రజల మనిషి అని చెప్పారు. ఈ నెల 15 నుంచి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తారంటూ ఈనాడులో ఒక బురద కథనం రాశారని ఆక్షేపించారు. నిత్యం జగన్‌పై విషం చిమ్ముతూ, చంద్రబాబును మోయడమే ఈనాడు లక్ష్యమని అన్నారు.
ఏనాడూ దూరంగా లేరు
వాస్తవానికి జగన్ ఏనాడూ జనానికి దూరంగా లేరని రాంబాబు చెప్పారు. చంద్రబాబు ఇప్పటివరకు ఆయన జీవితంలో ఎంత మందిని కలిశారో, అంతకన్నా 10 రెట్లు ఎక్కువ మందిని జగన్ కలిశారని తెలిపారు. రోజూ ప్రజల మధ్య ఉంటూ అందరితో మమేకమయ్యే మనిషి జగన్ అని చెప్పారు.
కోకొల్లలుగా ఘటనలు..
వైఎస్ జగన్ పర్యటనల్లో బస్సులో వెళ్తుంటే, రోడ్డుపై ఎవరైనా కాగితం పట్టుకుని చెయ్యి పైకెత్తితే చాలు, వెంటనే బస్సును ఆపేసి వారిని కలుసుకుంటారని గుర్తు చేశారు. అలా ఎందరో బాధలను ఆయన తీర్చారని, దీనికి సంబంధించి ఎన్నెన్నో ఘటనలు ఉన్నాయని తెలిపారు. జగన్‌ని కలుసుకునేందుకు తాము జనాలను తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని, ప్రజలే జగన్‌ను కలుసుకొనేందుకు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పారు.
ఇప్పుడూ కలుస్తున్నారు
వైఎస్ జగన్ ఇప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్‌లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అందరినీ కలుస్తున్నారని, ప్రతి ఒక్కరినీ ఓపికతో పలకరిస్తున్నారని, వారితో మాట్లాడుతున్నారని రాంబాబు వెల్లడించారు. నాయకులతో పాటు సామాన్యులను కూడా ఆయన కలుస్తున్నారని చెప్పారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న వైఎస్ జగన్‌పై పిచ్చి రాతలు రాసి, ఏదో ఒక విధంగా ఆయన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం మానుకోవాలని ఎల్లోమీడియాకు, ముఖ్యంగా ఈనాడు పత్రికకు రాంబాబు హితవు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment