సాక్షి, అమరావతి: బీజేపీ వంటి మతతత్వ పార్టీలకు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ఆదరణ ఉండదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో ఫిల్మ్ చాంబర్ హాల్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చిట్‌ఫండ్ చట్టాలను పాటించాల్సిన అవసరం లేదని మార్గదర్శి నిర్వాహకులు చెబుతున్నారని, అలాంటి వారిపై ఎందుకు కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తామంటున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అనవసరమని, దానికంటే ముందు దేశంలో ఆర్థిక అసమానతలు తొలిగించే దిశగా దృష్టి సారించాలని కోరారు. దీనిపై వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన వ్యతిరేకమా, అనుకూలమా అనే దానిపై వైఖరి ఏమిటో వెల్లడించాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో వివాహ, విడాకుల సంప్రదాయం ఒక్కోలా ఉంటుందని, అన్నిటికీ ఒకే విధానాన్ని తీసుకురావడం సమంజసం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వస్తే కాంగ్రెస్‌కు కచ్చితంగా మంచి జరుగుతుందన్నారు.
ప్రతిపక్షాల సమావేశ ప్రభావం ఉంటుంది
కేంద్ర ప్రతిపక్షాలు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న సమావేశ ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఉండవల్లి అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రంతోను, పార్లమెంట్‌తోను, స్పీకర్‌తోను తాను గొడవ పడుతుంటే సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వచ్చే సర్వేలు చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని, రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్రలో ఆయన ప్రసంగాలు అయోమయానికి గురి చేసేవిగా ఉన్నాయన్నారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నదో, బాధ్యులెవరో, దానిని పునరుద్ధరించడానికి ఎంత ఖర్చువుతుందో, అసలు పోలవరం ప్రస్తుత పరిస్థితి ఏమిటనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
రూ.కోటి 64.5 లక్షల కోట్లు అప్పులు చేసిన కేంద్రాన్ని అధికార, ప్రతిపక్షాలు ఒక్కమాట కూడా ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. మన రాష్ట్రం నుంచి వెళ్లిన పన్నుల సొమ్ము మొత్తం కేంద్రం ఇస్తే మనకు సరిపోతుందని.. అప్పులు చేయక్కర్లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment