ఎ. జీవన్‌రెడ్డి, టి. జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిల మధ్య బుధవారం అసెంబ్లీ ప్రాంగణం వేదికగా సరదా సంభాషణ చోటుచేసుకుంది. త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తల నేపథ్యంలో వీరిరువురి నడుమ ఆసక్తికర చర్చ సాగింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సమావేశం తర్వాత తన చాంబర్‌కు వెళుతున్న ఎమ్మెల్యేకు అటుగా వచ్చిన ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పలకరించారు.
మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రశ్నించగా.. అంతా మీ అభిమానం అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. పెద్దాయన (కేసీఆర్)ను అప్పుడే ఎందుకు దించే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించగా.. దేశంలో రైతులకు కేసీఆర్ అవసరం ఉంది అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. కేసీఆర్ ప్రధాని అయ్యాక కేటీఆర్ గురించి మాట్లాడండి. అప్పుడే ఎందుకు దించాలనుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చలోక్తి విసిరారు. తర్వాత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని గతంలో టీఆర్‌ఎస్‌లో చేరమని ఆహ్వానాలు అందిన అంశంపై ఇద్దరి మధ్య సంభాషణ సాగింది. కాంగ్రెస్‌లో ఉన్న టి.జీవన్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌లోకి రాకపోవడంతో టీఆర్‌ఎస్‌లో కూడా ఒక జీవన్‌రెడ్డిని తయారు చేశారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనడంతో నవ్వులు విరిశాయి. చదవండి: (తమిళనాడులో బీజేపీకి కేసీఆర్ సహకారం)
సీఎం దూరదృష్టి వల్లే విద్యుత్ రంగం పురోగతి
పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూరదృష్టి వల్లే విద్యుదుత్పత్తిలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా మారడంతో పాటు తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని శాసన సభ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ (పీయూసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ కమిటీ హాల్‌లో బుధవారం కమిటీ చైర్మన్ జీవన్‌రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన పీయూసీ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలను సమీక్షించారు.
అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయనతోపాటు కమిటీ సభ్యులు మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రావు మీడియాతో మాట్లాడుతూ...అంధకారంలో ఉన్న తెలంగాణను రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి వెలుగులోకి తెచ్చారని, రాష్ట్ర అవతరణకు ముందు స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 16వేల మెగావాట్లకు చేరిందన్నారు. విద్యుత్ రంగాన్ని మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.29 వేల కోట్లు ఖర్చు చేసినా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని తెలిపారు. 2014లో రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే విద్యుదుత్పత్తి పుష్కలంగా ఉండటంతో పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని మనోహర్‌రెడ్డి అన్నారు. గతంలో విద్యుత్ సమస్యల మూలంగా రైతాంగం తీవ్రంగా నష్టపోవడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపిందని, రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ప్రసాదించిన సీఎం కేసీఆర్ దేవుడని భాస్కర్‌రావు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment