సాక్షి,హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే (ఆర్వోలు) తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి పేర్కొన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని, బాధ్యతాయుతంగా ఈ పని పూర్తి చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి అధికారం రిటర్నింగ్ అధికారులదేనని పేర్కొన్నారు. కోవిడ్–19 నిబంధనలు తప్పక పాటించాలని, కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పకుండా ధరించాలని ఆదేశించారు. గురువారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి/ కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆర్వోలతో కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఫలితాలను పరిశీలకుల ఆమోదం తర్వాతే రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించి, పారదర్శకంగా నిర్వహిం చాలని, స్ట్రాంగ్ రూంను అభ్యర్థి లేదా వారి ఏజెంట్ సమక్షంలో ఉదయం 7.45 గంటలకు తెరవాలని చెప్పారు. సందేహాత్మక బ్యాలెట్ పేపర్లపై రిట ర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహించాలని, ప్రతి రౌండు తర్వాత ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు వారి సంతకాలు తీసుకోవాలని చెప్పారు.
మొబైల్ ఫోన్లు కౌంటింగ్ సెంటర్‌లోనికి అనుమతించరాదని పేర్కొన్నారు. హాల్ చిన్నగా ఉన్న 16 వార్డులలో 7 టేబుళ్ల చొప్పున రెండు కౌంటింగ్ హాల్స్‌కు అనుమతిస్తూ ఆర్వోలు, అదనపు ఆర్వోలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8,152, ఒక్కో రౌండ్‌కు 14,000 ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. 74,67,256 మంది ఓటర్లకుగాను 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, 1,926 పోస్టల్ బ్యాలెట్స్ జారీ చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment