ప్రజలు మా వైపే | GHMC Elections 2020: Amit Shah Hopes To Clinch Mayor Post | Sakshi
Sakshi News home page

ప్రజలు మా వైపే

Published Mon, Nov 30 2020 1:34 AM | Last Updated on Mon, Nov 30 2020 9:09 AM

GHMC Elections 2020: Amit Shah Hopes To Clinch Mayor Post - Sakshi

గులాబీ జల్లు: వారాసిగూడలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై అభిమానుల గులాబీ వర్షం

మేము ఏ ఎన్నికనూ చిన్నదిగా చూడం. మేము హైదరాబాద్‌కు సీఎంను కొట్టడానికి రాలేదు. మేము చేసింది, చేయబోయేది చెప్పడానికి, ఎన్నికల్లో పోరాడటానికే వచ్చాం. ఓట్లు, సీట్ల కోసం ఈ పోటీ కాదు.. మేయర్‌ పీఠం కైవసం చేసుకునేందుకే..
-అమిత్‌ షా

సాక్షి, హైదరాబాద్‌: చీకటి పొత్తులు ఎందుకని, టీఆర్‌ఎస్‌కు దమ్ముంటే ఎంఐఎంతో బహిరంగంగా పొత్తుపెట్టుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. మజ్లిస్‌– టీఆర్‌ఎస్‌లు పొత్తు పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, అదేదో బాహాటంగా చేయాలని... లోపాయికారీ వ్యవహారాలెందుకని నిలదీశారు. మజ్లిస్, టీఆర్‌ఎస్‌ల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే హైదరాబాద్‌లో వరదలు వచ్చాయని, 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. సీఎం నివాసం పరిసర ప్రాంతాల్లోని కాలనీలు కూడా మునిగిపోయాయన్నారు. బీజేపీ గెలిస్తే అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగిస్తామని, వరదల్లేని హైదరాబాద్‌గా చేస్తామన్నారు. వరదల సమయంలో కేసీఆర్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ ఐటీ హబ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేçషన్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సమగ్ర వసతులు కల్పించి హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని అమిత్‌షా తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరంలో సిటిజన్‌ ఛార్టర్‌ అమలు ఏమైందన్నారు. రోహింగ్యాల విషయంలో అసదుద్దీన్‌ ఒవైసీ పార్లమెంటులో ఏం మాట్లాడారో అంతా చూశారని, అక్కడ అడ్డుపడుతూ ఇక్కడ రాజకీయం చేస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే రోహింగ్యాలపై చర్యలు చేపట్టాలని రాతపూర్వకంగా ఇవ్వాలని, అప్పుడు తామేం చేస్తామో చేసి చూపిస్తామన్నారు. హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో కలపాలని ఎవరు చూశారో అసద్‌ చెప్పాలన్నారు. తాము గెలిస్తే నిజాం సంస్కృతి నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పిస్తామని, నయా హైదరాబాద్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలు ఓట్లు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. 

వంద రోజుల ప్రణాళిక ఏమైంది...
తాము ఏ ఎన్నికను చిన్నదిగా చూడమని, ఎన్నికలంటే ఎన్నికలేనన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు చిన్నవి కానేకాదన్నారు. తాము హైదరాబాద్‌కు సీఎంను కొట్టడానికి రాలేదని, సీఎం కేసీఆర్‌ 100 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తాము చేసింది, చేయబోయేది చెప్పడానికి, ఎన్నికల్లో పోరాడటానికే వచ్చామన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఈ పోటీ కాదని, మేయర్‌ పీఠం కైవసం చేసుకునేందుకేనన్నారు. రోడ్‌షోలో ప్రజాస్పందన చూస్తుంటే మేయర్‌ పీఠం బీజేపీదేనన్నది స్పష్టమైందన్నారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేసీఆర్‌చెప్పిన వంద రోజుల ప్రణాళిక ఏమైందన్నారు. ఐదేళ్లలో ఎందుకు చేయలేదన్నారు. ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు ఎందుకు రావడం లేదన్నారు. 

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఏవి?
హైదరాబాద్‌కు 1.35 లక్షల ఇళ్లను మోదీ ఇస్తే అందులో 1,100 కూడా కట్టలేదన్నారు. సీఎం చెప్పిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఏమయ్యాయన్నారు. నగర పరిసరాల్లో రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిన 15 డంప్‌యార్డులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మూసీ చుట్టూ ఆరు లేన్ల రోడ్లు ఎక్కడున్నాయని, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన ఏమైందన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు నగరానికి నలువైపులా నిర్మిస్తామన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎక్కడున్నాయని అడిగారు.

తాము హైదరాబాద్‌కు ఈఎస్‌ఐ, ఎయిమ్స్‌ ఆసుపత్రులను ఇచ్చామన్నారు. కేసీఆర్‌ తన రాజకీయ కారణాలతోనే పేదలకు రూ.5 లక్షల విలువైన వైద్యం అందే ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. కేంద్రం రాష్ట్రానికి బయో డైవర్సిటీ రీసెర్చ్‌ సెంటర్‌ ఇచ్చిందన్నారు. జాతీయ రహదారులు నిర్మించామన్నారు. మెట్రో ఇచ్చామని, దానిని మోదీ ప్రారంభించారన్నారు. 40,800 మందికి ముద్ర రుణాలను ఇచ్చామన్నారు. 
ఆదివారం సికింద్రాబాద్‌లోని నామాలగుండు వద్ద అమిత్‌ షా రోడ్‌ షో   

3 లక్షల మంది వీధివ్యాపారులకు రుణాలు
కరోనా కష్టకాలంలో వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ యోజన కింద ఒక్క తెలంగాణలోనే 3 లక్షల మందికి రుణాలు ఇచ్చామని, అందులో జీహెచ్‌ఎంసీలోనే 30 వేల మందికి ఇచ్చామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలోనూ మోదీ విధానాల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వచ్చాయని, అందులో హైదరాబాద్‌కూ వచ్చాయన్నారు. తద్వారా ఐటీ సెక్టార్‌ అభివృద్ధిలో ఉందని, ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం ఎనీవేర్‌ కల్పించి హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు ప్రయోజనం కల్పించామన్నారు. తాము గెలిస్తే జీహెచ్‌ఎంసీలో పారదర్శకతో కూడిన సుపరిపాలనను అందిస్తామని, కుటుంబపాలన నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్తామన్నారు. తాము చెప్పిందే చేస్తామని, తమకు అవకాశం ఇస్తే హైదరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. కేసీఆర్‌కు ఆయన, ఆయన కుటుంబం మినహా మరెవరూ పట్టరని, తాము అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. 

సచివాలయానికి వెళితే కదా... కేంద్రం ఏమిచ్చిందో తెలిసేది
జీహెచ్‌ఎంసీలో అవినీతి తగ్గితే బడ్జెట్‌ పెరుగుతుందన్నారు. కేంద్రం ఏం ఇచ్చిందని మాట్లాడే ముందు సీఎం ఫామ్‌హౌస్‌ను వదిలి బయటకురావాలని, రెగ్యులర్‌గా సెక్రటేరియట్‌కు వెళితే కేంద్రం ఏం ఇచ్చిందో తెలుస్తుందన్నారు. వరదసహాయం కింద రూ. 500 కోట్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి చేరుకున్నామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమకు వస్తుందన్నారు. కేసీఆర్‌ విధానాలే తమకు లాభిస్తాయన్నారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని విమానం అద్దెకు తీసుకొని 16 రాష్ట్రాల్లో కేసీఆర్‌ తిరిగారని, చివరకు ఆయనకే సీట్లు తగ్గిపోయాయన్నారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీది ఇదే పరిస్థితి అన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికి తిరిగే హక్కు ఉంటుందని, కేసీఆర్‌ తిరిగితే తిరుగనివ్వండి అని పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చేసేవేనని, వాటిపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. తాము రైతులను గౌరవిస్తామన్నారు. కేసీఆర్‌లా రాజకీయం చేయమన్నారు.

మతకలహాలపై మాట్లాడుతూ... బీజేపీ దేశంలో అనేక రాష్ట్రాల్లో, నగరాల్లో అధికారంలో ఉందని, అక్కడ శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో విమర్శలు చేసిన వారే సమాధానం చెపాలన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామన్నారు. తాను భాగ్యలక్ష్మి దేవాలయానికి అమ్మవారి దర్శనానికి మాత్రమే వెళ్లానన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అమిత్‌షాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఇన్‌ఛార్జి భూపేంద్రయాదవ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement