
సాక్షి, హైదరాబాద్: ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్ గెలిస్తే ఇంటికో బోటు ఇస్తుంది. దుబ్బాకలో మా గెలుపుకు ప్రధాన కారణం యువత.. రేపు జీహెచ్‌ఎంసీలో కూడా బీజేపీ గెలుపులో వాళ్లే ఉంటారు’ అన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి . హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన యువత, విద్యార్థులు, మహిళలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. వారి ఆకాంక్షలని బీజేపీ పూర్తి స్థాయిలో నేరవేర్చుతుందని హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘జీహెచ్‌ఎంసీలో నీతివంతమైన, సమర్థవంతమైన పరిపాలన అందిస్తాం. బీజేపీ అభ్యర్థి మేయర్ అయితే గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తాం. వరదలు రాని హైదరాబాద్ నిర్మాణం చేపడతాం. డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, ఫుట్ పాత్‌ల నిర్మాణం చేపడతాం’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
‘హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన ఫుట్‌ఫాత్‌ల మీద టీఆర్‌ఎస్ హోర్డింగ్‌లని ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం టాయిలెట్‌లు ఏర్పాటు చేశారు.. వాటికి నీటి సదుపాయం లేదు. ఎక్కడ చుసిన తండ్రి కొడుకుల బొమ్మలతో నింపేశారు. 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టారు. బీజేపీని గెలిపిస్తే వచ్చే వర్షాకాల సమయానికి 100 శాతం ఎవరి ఇళ్లలోకి నీళ్లు రాకుండా పునరుద్ధరిస్తాం. టీఆర్‌ఎస్ బోట్లు కావాలా.. వరద నీరు రాకుండా పునరుద్ధరణ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఏ పథకం అయిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా అమలవదు. 169 బస్తీ దవాఖానలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రికి, కేటీఆర్‌కి ఇదే నా సవాల్.. మీకు చిత్త శుద్ధి ఉంటే దీనిపై చర్చకు రావాలి’ అన్నారు కిషన్ రెడ్డి. (చదవండి: కార్లు తిరగాల్సిన రోడ్లపై పడవలు..)
‘ఇక పోలవరం అంశాన్ని పార్లమెంట్‌లో సోనియా గాంధీ చేర్చారు. కుటుంబ సమేతంగా సోనియాగాంధీ దగ్గరకు వెళ్ళి కాళ్ళు మొక్కినప్పుడు కేసీఆర్‌కు పోలవరం ముంపు గుర్తు రాలేదా?. ఎల్ఐసీని, ఆర్టీసీని అమ్మేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. మీ కుటుంబం అన్ని వ్యాపారాల్లో పెత్తనం చేలాయిస్తుంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే’ అన్నారు కిషన్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment