సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని అధికార టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. ఇష్టమున్నా.. లేకున్నా.. రాజధాని నగరానికి వెళ్లిపోయారు. అక్కడికి పోయి వస్తే సరి.. లేకుంటే.. రాలేదని మనసులో పెట్టుకుంటారనే భయంతో ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారపర్వంలో తాము కూడా ముందుంటున్నామంటూ నేతల దృష్టిలో పడేందుకు యత్నిస్తున్నారు.
కేటీఆర్ భుజాలపై ఎన్నికల బాధ్యతలు
సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకుని ప్రచార నగారా మోగించారు. కాలంతో పోటీపడి హైదరాబాద్‌లోని గల్లీల్లో ప్రచారం సాగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా గులాబీబాస్ టీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల, ఆ పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు బల్దియా బరిలో ప్రచారం చేసేందుకు కదిలిపోయారు. జిల్లా గులాబీదళం నగర వీధుల్లో ఇంటింటి ప్రచారం సాగిస్తోంది.(చదవండి: ఆరేళ్లలో బీజేపీ చేసింది సున్నా: కేటీఆర్)
రెండు డివిజన్లలో జిల్లా శ్రేణులు..
జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌లోని రెండు డివిజన్లలో ప్రచారం విస్తృతంగా సాగిస్తున్నారు. 123 డివిజన్ హైదర్‌గూడలో సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇందులో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, పార్టీ సీనియర్ నాయకుడు, సీఎం కేసీఆర్ మేనల్లుడు చీటీ నర్సింగరావు, పార్టీ జిల్లా బాధ్యుడు తోట అగయ్య, సీనియర్ నాయకులు కె.గోపాల్‌రావు, జిందం చక్రపాణి, జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, “సెస్’ డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు హైదర్‌గూడలో ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వెళ్లిన టీఆర్‌ఎస్ నాయకులకు అక్కడి కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాస్‌రావు అక్కడే ఓ ఫంక్షన్ హాల్‌లో బస, వసతి కల్పించారు. వేములవాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు 122వ డివిజన్‌లోని కూకట్‌పల్లిన్‌లో ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు హైదరాబాద్‌లో మకాం వేసి ప్రచారం సాగిస్తుండగా.. మరి కొందరు ముఖ్య నాయకులు త్వరలోనే హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
మొన్న దుబ్బాకకు దూరం...
ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికల ప్రచారానికి జిల్లా నాయకులు దూరంగా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో సిరిసిల్ల నియోజకవర్గ సరిహద్దులు కలిసి ఉంటాయి. ఇలా దగ్గరనేఉన్న దుబ్బాకకు టీఆర్‌ఎస్ శ్రేణులు దూరంగా ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పక్కగ్రామాల్లో పరిచయాలు ఉన్నా.. ప్రచారానికి వెళ్లకుండా టీఆర్‌ఎస్ శ్రేణులను కట్టడి చేశారు. అదే బీజేపీ నాయకులు దుబ్బాకకు వెళ్లి ప్రచారం చేశారు. దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ఛాన్స్ తీసుకోవద్దునే వ్యూహంతో క్షేత్రస్థాయిలో చురుగైన కార్యకర్తలు, నాయకులను బల్దియా పోరులో మోహరించారు. దుబ్బాక ఎన్నికలకు జిల్లా శ్రేణులు దూరంగా ఉండడంతో నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈసారి సర్వశక్తులను ఒడ్డేందుకు అధికార టీఆర్‌ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ శ్రేణులను రంగంలోకి దింపారు.
బల్దియా బాటలో బీజేపీ శ్రేణులు..
జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు కూడా హైదరాబాద్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాని తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు భాగ్యనగరం బాటపట్టినట్లు సమాచారం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు బండ మల్లేశ్‌యాదవ్, ఆడెపు రవీందర్, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, రెడ్డబోయిన గోపీ, శంకర్, ఆవునూరి రమాకాంత్‌రావు, గాజుల వేణు, అన్నల్‌దాస్ వేణు, కౌన్సిలర్లతోపాటు వివిధ మండలాల నాయకులు బల్దియా బాటపట్టారు. దుబ్బాక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో బీజేపీ నాయకులు నగరంబాట పట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జిల్లా నాయకుల భాగస్వామ్యం కీలకంగా ఉండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment