సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మహామహుల ప్రచారాలతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కాక రేపినగ్రేటర్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోగా.. అధికార టీఆర్‌ఎస్ జోరు తగ్గి వెనకబడింది. మొత్తం 150 డివిజన్లకుగాను నేరెడ్‌మెట్ ఫలితం (ఇక్కడ టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది) మినహా 149 స్థానాల్లో విజేతలను ప్రకటించారు. కారు 55 డివిజన్లలో దూసుకెళ్లగా.. 48 స్థానాల్లో కమలం వికసించింది. ఇక ఎంఐఎం పతంగి 44 స్థానాల్లో రెపరెపలాడింది. కాంగ్రెస్ తన రెండు స్థానాలకే పరిమితమైంది. ఇక హంగ్ ఏర్పడిన కారణంగా మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ ఎలా కైవసం చేసుకుంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 150 మంది కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి బల్దియా మేయర్ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 195 ఉండగా.. పీఠం దక్కించుకోవడానికి 98 మంది మద్దతు అవసరం. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌కు 86 మంది బలం మాత్రమే ఉండటంతో మేయర్ కుర్చీకి కొద్ది అడుగుల దూరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పీఠం కైవసానికి టీఆర్‌ఎస్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని తేల్చిచెప్పారు. ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో హంగ్ ఏర్పడింది. కారు స్పీడుకు బ్రేక్ పడగా... కమలం వికసించింది. టీఆర్‌ఎస్ 55 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి ఏకంగా 44 స్థానాలు తగ్గాయి. దుబ్బాక విజయంతో గ్రేటర్‌లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ అంచనాలకు మించి రాణించింది. అనూహ్యంగా 48 డివిజన్లలో విజయం సాధించింది.
కిందటిసారి నాలుగు సీట్లు మాత్రమే గెలిచిన కమలదళం... ఈసారి సర్వశక్తులూ ఒడ్డి అంతకు ఎన్నోరెట్ల విజయాన్ని నమోదు చేసింది. భవిష్యత్తులో తెలంగాణలో ఎదగడానికి కావాల్సిన ఉత్సాహం బీజేపీకి లభించింది. పాతబస్తీపై తమ పట్టును మజ్లిస్ మరోసారి నిరూపించుకుంది. 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2016లోనూ ఎంఐఎంకు సరిగ్గా ఇన్ని సీట్లే రావడం గమనార్హం. కాంగ్రెస్‌కు కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. కిందటిసారి లాగే కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక టీడీపీ గొప్పకు పోయి 106 స్థానాల్లో పోటీచేసినా... ప్రజలు అదొక పార్టీ ఉందనే గుర్తించలేదు. అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది.
వరద ‘దెబ్బే’!
టీఆర్‌ఎస్ అంచనాలు తల్లకిందులు కావడానికి వరదలు ప్రధాన కారణమ య్యాయి. ఎన్నికలకు ముందు వరదసాయం కింద బాధితులకు రూ.10 వేల చొప్పున అందించిన నగదుపరిహారమే దెబ్బకొట్టింది. అర్హులైన అందరికీ సహాయం అందకపోవడం, పంపిణీలో చోటుచేసుకున్న అవకతవకలు, తర్వాతి దశలో దరఖాస్తు చేసుకోవడానికి గంటల తరబడి మీసేవ కేంద్రాల ముందు నిలబడ్డా... ఆఖరికి సాయం అందకపోవడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. దాన్ని ఓట్ల రూపంలో చూపించారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ దెబ్బతినడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. పై అంతస్తుల్లో ఉన్నవారికి అందిన సాయం నిజంగా దెబ్బతిన్న కుటుంబాలకు అందకపోవడం లాంటి ఘటనలూ జనంలో వ్యతిరేకతను పెంచాయి.
నగదు రూపంలో అందజేసిన వరదసాయాన్ని స్థానిక నాయకులు సొంతజేబుల్లో వేసుకున్నారని, తమ అనుయాయులకే ఇప్పించుకున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వరదతాకిడికి బాగా దెబ్బతిన్న ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడ, సరూర్‌నగర్, చంపాపేట, ఐఎస్‌సదన్ తదితర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ ఓటమికి వరదసాయంలో అవకతవకలు, అర్హులైన వారికి అందకపోవడమే కారణమని చెబుతున్నారు. డివిజన్‌కో ఎమ్మెల్యేను ఇన్‌చార్జిగా నియమించి... పకడ్బందీగా ప్రచారం నిర్వహించిన టీఆర్‌ఎస్ ఈస్థాయిలో వ్యతిరేకతను ఊహించలేకపోయింది. కిందటి ఎన్నికల్లో కంటే కొన్నిసీట్లు తగ్గినా... ఎక్స్‌అఫీషియో బలంతో సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోగలమనే భావించింది. కానీ వారి అంచనాలు తప్పాయి.
కమలం... సక్సెస్
భావోద్వేగాలపై ప్రచారం సాగించి బీజేపీ ఆశించిన దానికంటే ఎక్కువ లాభపడింది. భవిష్యత్తులో బలపడే అవకాశాలున్నాయని పసిగట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం... ఒక కార్పొరేషన్ ఎన్నికే అయినా గ్రేటర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనాయకులు పలువురు ప్రచారం నిర్వహించడం, వరదసాయం నగదుపంపిణీలో అవతకవకల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం... కలిసొచ్చాయి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ఓటర్లలో విశ్వాసాన్ని కలిగించడంలో కాషాయదళం సఫలమైంది. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామనడం, రోహింగ్యాలకు, అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలతో హిందువుల ఓట్లను బీజేపీ ఆకర్షించగలిగింది. బల్దియా ఎన్నికలకు వెళ్లేందుకు టీఆర్‌ఎస్ తొందరపాటు సైతం ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీని, నేతల్ని ప్రజలు విశ్వసించలేదు. వాళ్లు ఎన్నోకొన్ని సీట్లు గెలిచినా ఒరిగేదేమీ ఉండదనే తలంపుతోనూ ప్రజలు ఆ పార్టీని పట్టించుకోలేదు. ఇక టీడీపీ 106 వార్డుల్లో పోటీచేసినా ఒక్కచోట కూడా గెలువలేకపోయింది.
రెండు నెలలు ఆగాల్సిందే...
జీహెచ్‌ఎంసీలో కొత్త పాలకమండలి కొలువుదీరాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు గడువు ముగిసేవరకు పాలకమండలి ఉంటుంది. ఫిబ్రవరి 10 తర్వాతే కొత్త సభ్యులు బాధ్యతలు చేపడతారు. అధికార వర్గాల సమాచారం మేరకు ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ సిఫార్సుల కనుగుణంగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లను గెజిట్ నోటిఫికేషన్ వెలువరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment