తెలంగాణ రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం మరింతగా పెరుగుతోందా? గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య మాటలు ఎందుకు లేవు? రాజ్‌భవన్‌కు సీఎం ఎందుకు వెళ్ళడంలేదు. అసెంబ్లీకి గవర్నర్‌ను ఎందుకు ఆహ్వానించడంలేదు? గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్‌ను తెలంగాణ సర్కార్ ఎందుకు పాటించడంలేదు?
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో బాధ్యతలు తీసుకుని మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. తాను పరిధి అతిక్రమించానంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని, గవర్నర్‌గా తన పరిధి, బాధ్యతలు ఏంటో తనకు తెలుసని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నవారు.. సీఎం చేస్తున్న రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాజ్‌భవన్ పట్ల ముఖ్యమంత్రి వివక్ష ఎందుకు చూపిస్తున్నారని అడిగారు గవర్నర్ తమిళిసై.
గవర్నర్‌కు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్‌ను తెలంగాణ ప్రభుత్వం పాటించడంలేదని, ప్రభుత్వం తనను అనేకసార్లు ఇబ్బంది పెట్టిందని కూడా ఆమె కామెంట్ చేశారు. సమక్క, సారలమ్మ జాతరకు వెళ్ళేందుకు హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదని, తాను నాలుగు గంటల పాటు కారులో ప్రయాణం చేసి అక్కడకు వెళ్ళినట్లు చెప్పారు. తన పర్యటనకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సంయుక్త సెషన్‌కు ఆహ్వానించలేదని, రిపబ్లిక్ డే సందర్భంగా పతాకావిష్కరణకు అవకాశం ఇవ్వలేదని, రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి వస్తానని సమాచారం ఇచ్చి హాజరు కాలేదని గవర్నర్ తమిళిసై మీడియాకు వివరించారు. తాను గవర్నర్‌గా ఉన్న మూడేళ్ళ వ్యవధిలో రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చానని గవర్నర్ చెప్పారు.
దాదాపు ఏడాది కాలంగా ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో మండలికి పంపాలని సిఫార్సు చేస్తే.. గవర్నర్ ఆ ఫైల్‌ను పక్కన పెట్టారు. ఇక అప్పటి నుంచే ముఖ్యమంత్రికి, గవర్నర్ మధ్య గ్యాప్ పెరగడం మొదలైందనే ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు, సంఘటనలు సామాన్యులకు సైతం అర్థం కాలేదు.
ఈ సందర్భంగా గవర్నర్ పలుసార్లు తన అసహనాన్ని, అసంతృప్తిని బహిరంగంగానే వెలిబుచ్చారు. అయినా తెలంగాణ సర్కార్ తన ధోరణిలోనే తాను ముందుకు సాగుతోంది. అయితే జులై మాసంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం జరిగితే రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ తమిళిసైతో మామూలుగానే మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్యా మళ్ళీ సయోధ్య కుదిరిందని అందరూ భావించారు. ఆగస్ట్ 15న రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి వస్తానని సమాచారం ఇచ్చిన కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఈ ఘటనతో రాజ్‌భవన్, ప్రగతి భవన్ ఇప్పట్లో దగ్గర కావనే విషయం నిర్ధారణ అయింది.
ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని ఇవ్వడంలేదని గవర్నర్ భావిస్తున్నారు. అందుకే తాను ఎక్కడకు వెళ్ళినా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోయినా తాను ప్రజలకు చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటానని.. రాజ్‌భవన్‌ను ఈ మూడేళ్ళ కాలంలో ప్రజాభవన్‌గా మార్చానని తమిళిసై చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment