న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ పంపిణీ విధానం న్యాయబద్ధంగా లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘టీకాలను కేంద్రమే కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు పంపిణీ చేయాలని మొదట్నుంచీ చెబుతూనే ఉన్నా. టీకా పంపిణీపై ప్రభుత్వం విధానం సరిగా లేదు. మోదీ ప్రభుత్వం తీరు అసమానతలకు తావిస్తోంది’అని పేర్కొన్నారు.
దేశంలోని కేవలం 9 ప్రైవేట్ ఆస్పత్రులు 50 శాతం టీకాలు పొందాయని, కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా డోసుల్లో 80 శాతం వరకు ఆరు నగరాలకు సరఫరా అయ్యాయంటూ వచ్చిన వార్తలను ఆయన ట్విట్టర్‌లో0 ఉదహరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ట్విట్టర్‌లో.. సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు ఆస్పత్రుల్లో బెడ్ల కొరతతో ఇబ్బందులు పడుతుండగా, కేంద్రం మాత్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు.
తమ ప్రభుత్వం కోవిడ్‌పై గెలుపు సాధించిందంటూ జనవరిలో ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లను 36%, ఐసీయూ బెడ్లను 46%, వెంటిలేటర్ల బెడ్లను 28% మేర తగ్గించారని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్య వసతులను మెరుగుపర్చాలన్న సూచనలను ప్రధాని పక్కనబెట్టారు. ప్రస్తుత పరిస్థితికి ఎవరు బాధ్యులు అని ఆమె ప్రశ్నించారు. ‘ప్రజారోగ్యంపై నిపుణుల సూచనలను, పార్లమెంటరీ కమిటీల సిఫారసులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాలను మెరుగు పరుస్తామంటూ చేసిన హామీలనుకూడా ప్రభుత్వం విస్మరించింది’అని ప్రియాంక పేర్కొన్నారు. 2014 నుంచి కొత్తగా ఒక్క ఎయిమ్స్ కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment