Gudivada Amarnath Serious Comments On Janasena Pawan Kalyan, Details Inside - Sakshi
Sakshi News home page

‘పవన్‌.. అసెంబ్లీకి రావాలనుకుంటే విజిటింగ్‌ పాసులిస్తాం’

Published Wed, Mar 15 2023 6:32 PM | Last Updated on Wed, Mar 15 2023 7:50 PM

Gudivada Amarnath Serious Comments On Janasena Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఫైరయ్యారు. ఆవిర్భావ సభ ఉద్దేశమేంటో పవన్‌కే తెలియదంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన. నమ్ముకున్న జనసేన క్యాడర్‌ను పవన్‌ నట్టేటముంచడం ఖాయమని కామెంట్స్‌ చేశారు. అసెంబ్లీకి రావాలనుకుంటే.. పవన్‌కు విజిటింగ్ పాసులిస్తామని స్పష్టం చేశారు. 

కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మంత్రి అమర్నాథ్‌ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. మచిలీపట్నం సభలో పవన్‌కళ్యాణ్‌ ప్రసంగంలో కొత్తగా కనిపించింది.. వినిపించేదేమీ లేదు. ఒక రాజకీయపార్టీ పెట్టి గంపగుత్తగా మూటగట్టి మరో రాజకీయ పార్టీకి అమ్మేదామనే లక్ష్యం ఉన్న నాయకత్వం నిన్న పవన్‌లో కనిపించింది. కులాలతో సంబంధంలేదని చెబుతూనే.. కాపులంతా కమ్మసామాజికవర్గానికి అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉండాలని నిన్నటి ప్రసంగంలో వినిపించింది. కొన్నిచోట్ల జనసేన పోటీచేసినా.. ఓట్లు మాత్రం టీడీపీకి వేసి చంద్రబాబుపై ఉన్న ప్రేమ, మమకారం చాటుకోవాలని పవన్‌ తన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. 

జెండా జనసేనది.. అజెండా టీడీపీది..
పదేళ్లలో జనసేన పార్టీ తీరును చూస్తే.. 2014లో కొంతమందితో పొత్తు, 2019లో మరికొంతమందితో పొత్తులు పెట్టుకుంటే.. ఇప్పటికే ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీ గురించి ఏమని మాట్లాడారో అందరూ చూశారు. కనీసం రాజకీయ అజెండా అనేది లేకుండా, రాజకీయ పార్టీని ఎందుకు పెట్టారో కూడా తెలియకుండా పవన్‌ పర్యటనలు చేస్తుంటాడు. చంద్రబాబు సమర్ధత గురించి మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం కూలిపోవాలంటాడు. ప్రసంగాలతో ఊగిపోతుంటాడు. జెండానేమో జనసేనది.. అజెండా మాత్రం టీడీపీది అని అందరికీ ఇప్పటికే అర్ధమైంది. 

మూటగట్టి చంద్రబాబుకు అమ్మేద్దామనేది..
ఒకపక్కనేమో కుల ప్రస్తావన లేనటువంటి రాజకీయ పార్టీ పెట్టానని గొప్పగా చెప్పుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌.. మరోపక్క మాత్రం కులాల గురించి నిన్నటి సభలో ఎంతసేపు మాట్లాడారో అందరకీ తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగంతో నిన్న అందరికీ తెలిసిందేమంటే.. తన ఎజెండా ప్రకారం.. కాపు కులాన్ని ఆయనతో పాటు ఉండే వ్యక్తులందర్నీ మూటగట్టి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అమ్మకం పెట్టాలనే ఉద్దేశమనేది తేటతెల్లమైంది. 

ముమ్మాటికీ దత్తపుత్రుడే..
మేం ఇప్పటికే అనేక సందర్భాల్లో వపన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి చంద్రబాబుకు దత్తపుత్రుడని చెప్పుకుంటూ వచ్చాం. దానికి నిన్నటి సభతో మరోసారి అందరికీ తెలిసిపోయింది. పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం ద్వారానే తనకు తానుగానే చంద్రబాబు మనిషినని చెప్పుకున్నట్లైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే తాపత్రయంతోనే పవన్‌కళ్యాణ్‌ ఊగిపోయే ప్రసంగాలు చేస్తున్నాడని అందరికీ నిన్నటితో అర్ధమైంది. చంద్రబాబును, టీడీపీని పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట ఎందుకు అనలేకపోతున్నాడనేది ఈరోజు ప్రజలంతా చర్చించుకుంటున్నారు. 

అసెంబ్లీకి రావాలనుకుంటే పాసులిస్తాం..
ఏదో రకంగా పవన్‌ కళ్యాణ్‌ అసెంబ్లీకి వస్తానని చెబుతున్నాడు. అసెంబ్లీకి రావాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిన పనేముంది..? కావాలంటే, అసెంబ్లీ విజిటింగ్‌ పాసులు మేం ఏర్పాటుచేస్తాము కదా..? మా స్పీకర్‌ని అడిగితే, రెండు పాసులు ఇస్తారు. వాటిని పట్టుకుని అసెంబ్లీ ఎలా ఉంటుందో.. అనేది చూసి పవన్‌కళ్యాణ్‌ వెళ్లిపోవచ్చు.

175 చోట్ల పోటీచేసే దమ్ములేని నేత..
ఎన్నికల్లో 175 స్థానాలకు 175చోట్ల పోటీచేస్తానని చెప్పుకునే ధైర్యం జనసేన అధినేతగా పవన్‌కళ్యాణ్‌కు ఉందా..? అంటే, అంతటి సాహసం కూడా ఆయనకు లేదు. కనీసం, ఇంకో రాజకీయ పార్టీతో కలిసి ఎన్నికలకు వస్తామని చెప్పడానికీ అతని దగ్గర క్లారిటీ లేదు. చివరికి పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎవరికి అమ్ముడుపోయినా.. దాంట్లో తన కేడర్‌, తనను నమ్ముకున్నవారంతా భాగస్వామ్యులు అవ్వాలని కోరుతున్నాడు.

పొంతనలేని మాటలతో ఊకదంపుడు ప్రసంగం..
ఈ రాష్ట్రంలో ఇక్కడెవరికీ దమ్మూ, ధైర్యం లేదంటున్నాడు పవన్‌ కళ్యాణ్‌. తెలంగాణలో ఉన్న పోరాటస్ఫూర్తి ఇక్కడ లేదంటున్నాడు. పోనీ, తెలంగాణలోనైనా ఎన్నికల్లో పవన్‌ పోటీకి వెళ్లవచ్చు కదా..? అదీ చేయడు. ఆంధ్రా, తెలంగాణలో ఆయన ఎక్కడ తిరగాలన్నా ఏదొక పార్టీతో అంటకాగడం అలవాటైంది. సందర్భాన్ని బట్టి సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం అనేది ఈమధ్య పవన్‌కు బాగా పరిపాటిగా మారింది. వంగవీటి మోహనరంగా గురించి మాట్లాడతాడు. రంగా కాపు, ఆయన సతీమణి కమ్మ కులం అంటాడు. వారిద్దరికీ పుట్టిన రాధాకు రెండు కులాలంటాడు. ఒంగోలులో తనకు ముగ్గురు రెడ్లు స్నేహితులున్నారంటాడు. వాళ్ల పేర్లు కూడా చెబుతాడు. ఆయనవన్నీ పొంతనలేని మాటలే.. అసలు, పవన్‌కకు ఈ కులాల గోల ఎందుకు..?

పవన్‌ నాయకత్వాన్ని నమ్మితే మునిగినట్టే..
జనసేన పార్టీకి ఒక అజెండా ఉందా..? ఒక సిద్ధాంతం లేదా..? ఆయన పార్టీ స్టాండ్‌ ఏంటో పవన్‌ చెప్పాలి కదా..?. చివరికి, పవన్‌.. జనసేన పార్టీని ఎందుకు పెట్టారయ్యా అంటే, జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడానికే తప్ప వాళ్లు అధికారంలోకి రావడానికో.. వాళ్ల పార్టీ నాయకులు రాజకీయంగా ఎదగడానికో పెట్టలేదు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పోరాడతానని ఆయన మాటల్లో నిన్న స్పష్టమైంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్‌ వెంట తిరిగే నాయకులనే చెప్పాలి. వవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి ఆయన్ను నమ్ముకున్న పాపానికి తమను మూటగట్టి తెలుగుదేశం పార్టీకి అమ్మాలని చూస్తున్నాడని జనసేన కేడర్‌ అర్థం చేసుకోవాలి. 

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చెప్పు ఎత్తలేదే..? 
పవన్‌ కళ్యాణ్‌ ఎవరి దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకున్నాడనే విషయం మేం ఇప్పటివరకు మాట్లాడలేదు. అయితే, ఆయన దత్తదండ్రి, పార్ట్‌నర్‌ అయినటువంటి చంద్రబాబు గెజిట్‌ పత్రిక ఆంధ్రజ్యోతి మాత్రం పవన్‌ వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీకి డీల్‌ కుదుర్చుకున్నాడని రాస్తే.. వారి టీవీలో ప్రసారం చేస్తే ఆయన ఒక్కమాట కూడా మాట్లాడకపోవడంలో అంతరార్ధమేంటి..? ఆంధ్రజ్యోతి దినపత్రిక మీద, ఏబీఎన్‌ రాధాకృష్ణ మీద చెప్పులెందుకు ఎత్తలేదు..? అంటే, సొంత మనుషులు ఏమన్నా కూడా పవన్‌ పట్టించుకోడన్నమాట. వైరిపార్టీల మాటలే ఆయన చెవులకు వినిపిస్తాయి. ఇంత జరుగుతున్నా.. నిన్న మచిలీపట్నం సభలో ఆయన అంతగా విడమరిచి తన ఉద్దేశమేంటో చెప్పినా.. పవన్‌ అమ్ముడుపోలేదని ఎవరైనా అనుకుంటే, వారంత అమాయకులు ఎక్కడా ఉండరని చెప్పాలి. ఒకవేళ, అలాంటి అమాయకులు ఇంకా ఉన్నారంటే.. జనసేనపార్టీ కార్యకర్తలుగానే ఉన్నారేమో.

దమ్మున్న నేతగా సీఎం జగన్‌ దిశానిర్దేశమది..
సీఎం వైఎస్‌ జగన్‌.. ఏ వేదిక మీద మాట్లాడినా.. ‘175 స్థానాలకు 175 చోట్ల మనం గెలవబోతున్నాం.. ఆ మేరకు మీరంతా కష్టపడండి..’ అని మా అందరికీ దిశానిర్దేశం చేస్తారు. మరి, పవన్‌ నిన్న వేదికపైన నిల్చొని మాట్లాడేటప్పుడు..‘ఇదిగో వేదికమీద నాతో పాటు ఉన్న నాయకుల్ని, వేదిక కింద ఉన్న పార్టీ కేడర్‌ను 175 స్థానాల్లో రేపటి ఎన్నికల్లో గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకెళ్తాను’ అని దమ్ముగా ఎందుకు చెప్పలేకపోయాడు..? ‘ఇదిగో.. నాకు ఒక సీటిస్తారా..? రెండు సీట్లు ఇస్తారా..? నన్ను 10 చోట్ల పోటీచేయమంటారా..? ఏదోరకంగా అసెంబ్లీకి రమ్మంటారా..?’ అంటూ దేహీమని బతిమాలుకోవడం ఒక రాజకీయ పార్టీ నడిపే  నాయకుడి లక్షణం, వ్యక్తిత్వం కాదు. దీన్నిబట్టి జనసేన పార్టీ కేడర్‌ వారి అధినేత తీరును అర్ధం చేసుకోవాలనేది మా అభిప్రాయం.

చిరంజీవికి తమ్ముడువి కాదా..? 
వ్యూహాలు.. వ్యూహాలు అంటూ పవన్‌ పెద్దపెద్ద మాటలు వల్లెవేస్తున్నాడు. పార్టీ పెట్టిన దగ్గర్నుంచి నువ్వు అనుసరించిన వ్యూహామేంటి?. కాసేపు నాకు రాజకీయాలతో సంబంధం లేదంటావు. నా కుటంబంలో ఎవరూ రాజకీయ నాయకులు లేరంటావు.. మరి, నువ్వు చిరంజీవికి తమ్ముడువి కాదా..? ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నువ్వు యువరాజ్యం అధ్యక్షుడివి కాదా..? నీకు ఆ రాజకీయ అనుభవం లేదా..? ఆరోజు 294 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశానని గొప్పగా చెప్పుకుంటావు కదా.. మరి, ఈరోజు నువ్వు పర్యటన చేసినచోట చిరంజీవి పేరును కూడా ఎందుకు పలకలేకపోతున్నావు..? ఇదొక వ్యూహమా..? అసలు, పవన్‌ వ్యూహాలు చేసి ఈ రాష్ట్రంలో ఏం సాధిద్దామని అనుకుంటున్నాడు..? బీజేపీతో మిత్రపక్షం అంటాడు.. అతని చేయి మాత్రం మరోవైపు చూస్తూ ఉంటుంది. అతని చేయి మాత్రం మరోపార్టీ అధినేత చేతిలో బిగుసుపోతుంది అంటూ ఎద్దేవా చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement