
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శల్లో వాస్తవం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే నాలుగున్నర లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ స్థాయిలో ఉద్యోగాలిచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజా రంజకంగా పరిపాలిస్తున్న సీఎంపై కేంద్ర మంత్రి విమర్శలు హాస్యాస్పదమన్నారు.
జగన్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్న విషయాన్ని కేంద్ర మంత్రి తెలుసుకోకుండా సుజనాచౌదరి టీడీపీ కార్యాలయం నుంచి తెచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం బాధాకరమన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించేందుకు కేంద్రం సిద్ధపడుతోందని, అందులో మీ కమీషన్ ఎంతో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పోలవరానికి రూ.2,900 కోట్లను ఇప్పటికీ చెల్లించలేదన్నారు.
పవన్‌కల్యాణ్ పార్టీ కమ్మ జనసేన కాదని ఎలా అనగలమని ప్రశ్నించారు. సీఎం జగన్ దంపతులు ఎంతో గౌరవంగా చిరంజీవిని సాగనంపారన్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలని సూచించారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వచ్చి లోకేశ్ రాజకీయాలు చేయడం అవసరమా? అంటూ మంత్రి అమరనాథ్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment