పశ్చిమ బెంగాల్‌లోని ‘సందేశ్‌ఖాలీ’ అరాచకాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను కస్టడీకి అప్పగించే విషయంలో బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య రసవత్తర రాజీకీయం నడుస్తోంది. తాజాగా షాజహాన్‌ను సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్ పోలీసులకు కలకత్తా హైకోర్టు కొత్త డెడ్‌లైన్ విధించింది
సందేశ్‌ఖాలీ కేసుపై జస్టిస్‌లను హరీష్ టండన్, హిరన్మయి భట్టాచర్యాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా షాజహాన్‌ను నేటి సాయంత్రం 4.15 నిమిషాల వరకు సీబీఐకి అప్పగించాల్సిందేనని ఆదేశించింది. సీఐడీపై కోర్టు ధిక్కారం నమోదు చేయాలని సీబీఐ కోరిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో సీబీఐ అధికారులు బెంగాల్ పోలీసు హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నారు. ఎట్టకేలకు షాజహాన్‌ను పోలీసులు సీబీఐకి అప్పజెప్పారు.
ఇక ఈ కేసులో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు మంగళవారమే ఆదేశాలు ఇచ్చింది. కానీ దీనిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లెక్కచేయలేదు. అతడిని అప్పగించబోమని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా.. షాజహాన్‌ను అప్పగించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
చదవండి: Rajasthan : డబుల్ జీరో! కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారేనా?
అనంతరం సీబీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాటి ఆదేశాలపై సుప్రీం ఎటువంటి స్టే ఇవ్వలేదని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం షాజహాన్ షేక్‌ను అప్పగించడం లేదని ఈడీ చెప్పడంతో నేటి సాయంత్రానికి నిందితుడు షాజహాన్ షేక్‌ను అప్పగించి తీరాల్సిందేనని హైకోర్టు డెడ్‌లైన్ విధించింది.
కాగా గత కొంతకాలంగా సందేశ్‌ఖాలీ పేరు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. అనంతరం అతడు స్థానికుల నుంచి భూములు లాక్కోవడం, ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆకృత్యాలపై, టీఎంసీ గుండాలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు రోడ్డెక్కారు. ఈ ఉద్యమానికి బీజేపీతో సహా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి.
ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. దాదాపు 55 రోజుల తర్వాత గవర్నర్, హైకోర్టు అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే షాజహాన్‌ని కాపాడుతోందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ వివాదం పెద్దది కావడంతో టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరిస్తూ.. అతడిపై తమక సానుభూతి లేదని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment