కాంగ్రెస్‌లో పనితనంతో పార్టీని గెలిపించినా విధేయత లేకపోతే మైనస్ మార్కులు పడతాయి. ఉన్న పదవులు ఊడిపోతాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో విధేయతకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అనేక సంఘటనలు నిరూపించాయి. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విధేయతకే హైకమాండ్ మార్కులు వేసింది.
ఇండియాలో ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్‌లో చాలా మంది నాయకులు టాలెంట్ లేకపోయినా విధేయత అనే పెట్టుబడితోనే ఎక్కడికో ఎదిగిపోయారు. అలాంటి విధేయతా కార్డుతోనే అశోక్ గెహ్లాట్ 1998లో రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అప్పటి ఎన్నికల్లో ఎంతో ప్రభావం చూపించిన ప్రముఖ జాట్ నేత పరశురాం మడర్నాను కాదని కేవలం విధేయతే అర్హతగా గెహ్లాట్‌ను సీఎంగా ఎంపిక చేశారు సోనియా గాంధీ. 1998 ఆరంభంలో కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం సమయంలో గెహ్లాట్.. సోనియా గాంధీకి అండగా నిలబడ్డారు. అందుకు ప్రతిగానే సోనియా గాంధీ ఎమ్మెల్యేల మాటను కాదని గెహ్లాట్‌ను సీఎంగా..పరశురామ్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా నియమించారు.
ఇప్పుడు అదే గెహ్లాట్ సోనియా మాటను కాదన్నారు. రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఇచ్చిన ఆదేశాన్ని గెహ్లాట్ ధిక్కరించారు. తన వర్గం వ్యక్తికే ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలనే ప్లాన్‌తో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. అందుకే సోనియా గాంధీ ఇప్పుడు అశోక్ గెహ్లాట్‌ను పార్టీ అద్యక్ష పదివి రేస్ నుంచి తప్పించారు. ఇక ముఖ్యమంత్రి పదవి కూడా నేడో రేపో గెహ్లాట్‌కు దూరం కానుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. విధేయత కార్డుతో ఎదిగిన ఎదిగిన గెహ్లాట్ ఇప్పుడు అదే విధేయత లోపించిందనే కారణంతో గాంధీల కుటుంబానికి దూరమయ్యారు. తనను తాను గాంధీ విధేయుడిగా 50 ఏళ్ల పాటు చెప్పుకున్న గెహ్లాట్ ఒక్క సంఘటనతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గడపకు అవతల నిలబడ్డారు.
ఇక విధేయత అనే పెట్టుబడితే ఇప్పుడు మరో నేత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అధిష్టించబోతున్నారు. 60ఏళ్ల పాటు కాంగ్రెస్ రాజకీయాల్లో ఆరితేరిన కర్నాటకకు చెందిన సీనియర్ నేత.. మల్లికార్జున ఖర్గే ఇప్పుడు ఏఐసీసీలో అత్యున్నత పదవిని అందుకోబోతున్నాడు. అటు ఎమర్జెన్సీ కాలం నుంచి ఇందిరాగాంధీ విధేయుడిగా..ఇటు సీతారాం కేసరి సంఘటన నుంచి గెహ్లాట్ సంక్షోభం వరకు ఖర్గే అన్ని సందర్భాల్లోనూ గాంధీ కుటుంబానికి విధేయుడు. ఇప్పుడు అదే విధేయత ఖర్గేను అందలం ఎక్కిస్తోంది. ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయడంలో కాంగ్రెస్ రెండు లాభాలు చూస్తోంది. ఇందులో దళితుడికి అధ్యక్ష పదవి ఇచ్చాం అనే ప్రచారం కాంగ్రెస్‌కు ఎన్నికల్లో కలిసివస్తుంది... ఇక రాబోయే కర్ణాటక ఎన్నికల్లో ప్రయోజనం కలిగిస్తుందనేది మరో ఆలోచన.
మొత్తం మీద కాంగ్రెస్ రాజకీయాల్లో సమర్థత కంటే కూడా విధేయతే కీలకం. విధేయత ఉన్నవారు పార్టీలో ఏ స్థాయికైనా ఎదుగుతారు. లేదంటే అధపతాళానికి పడిపోతారు. తాజా పరిణామాలు ఈ విషయాన్నే రుజువు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment