బీసీలకు ప్రకటించిన హామీలను కాపులకూ ప్రకటించాల్సిందే..
మాజీ ఎంపీ హరిరామజోగయ్య లేఖాస్త్రం
పాలకొల్లు సెంట్రల్: జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు జయహో బీసీ అంటూ పది హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు సరే.. మరి కాపుల డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరిరామజోగయ్య ప్రశ్నించారు. బుధవారం ‘జయహో కాపూస్ జయహో బీసీస్’ అంటూ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ సరే, కాపుల డిక్లరేషన్ ఎప్పుడంటూ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. 52 శాతం ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమేనని, కాపులకూ డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సిందని సూచించారు.
మంగళగిరిలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్‌లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలిచ్చారని, ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
టీడీపి –జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ ప్రకటించాల్సిందేనన్నారు. ఇదిలా ఉండగా, మదనపల్లికి.. శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి.. ఆరణి శ్రీనివాస్, రాజంపేట.. ఎంవీ రావు, అనంతపురం.. టీసీ వరుణ్, పుట్టపర్తి.. శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు.. మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్‌కు జోగయ్య మరో లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment