సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 24 వేల ఉద్యోగాలిస్తే...ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొమ్మిదేళ్ల పాలనలో 1.52 లక్షల ఉద్యోగాలిచ్చామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మరో 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని జడ్చర్ల బీజేపీ సభలో హిమాచల్ సీఎం సుక్విందర్‌సింగ్ సుక్కు అబద్ధాలు మాట్లాడటం సరికాదని..ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని హరీశ్‌రావు హితవు పలికారు.
జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రిని శనివారం ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రసంగించారు. హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలోకి వలసలు వచ్చి బతుకుతున్నారని, ఎంతోమందికి తెలంగాణ జీవనోపాధిగా మారిందని చెప్పారు.
కాంగ్రెస్, టీడీపీ పాలనలో దేశంలోనే వలసలకు, కరువు కాటకాలకు నిలయంగా మారిన పాలమూరు నేడు పచ్చబడి పసిడి పంటలతో అలరారుతోందన్నారు. రేపో మాపో ‘పాలమూరు’నీళ్లు వచ్చి జడ్చర్లను ముద్దాడబోతున్నాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు వాటిని 55కు పెంచామని వెల్లడించారు. తెలంగాణలో మొట్టమొదటి మెడికల్ కాలేజీ పాలమూరుకు వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment