సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: చరిత్రను కొందరు సిరాతో, మరికొందరు రక్తంతో రాస్తే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతు నాగలితో ఆకుపచ్చ చరిత్ర రాశారని.. దీనికి ప్రధానం కాళేశ్వరమని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ సమీపంలో మంగళవారం నిర్వహించిన సిద్దిపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మూగ జీవాలకు కూడా గ్రాసంలేని దుస్థితి ఉండేదని.. నేడు పది రాష్ట్రాలకు తిండిపెట్టే ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండిస్తున్నారని చెప్పారు. మన రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్‌నిధి పేరుతో కేంద్రం అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు చేసినా... రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
ఉదయం కేసు వేస్తే.. సాయంత్రం ఫైల్ వెనక్కి పంపుతారా?
యూనివర్సిటీల్లో నియామకాల కోసం ఉద్దేశించిన కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫైల్ ఆమోదించకుండా ఏడు నెలలుగా తొక్కిపెట్టిన గవర్నర్.. సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారని తెలిసి సాయంత్రం బిల్లులు వెనక్కి పంపడంలో కుట్ర స్పష్టంగా బయటపడిందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్‌ను వెనక్కి పంపడానికి గవర్నర్‌కు ఏడు నెలలు కావాలా? అని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఫారెస్ట్రీ యూనివర్సిటీ ఫైల్‌ను సైతం ఆమోదించకుండా తొక్కిపెట్టి ఏడు నెలల తర్వాత వెనక్కి పంపడం అభివృద్ధిని అడ్డుకోవడం కాదా? అని మంత్రి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment