Haryana Minister Gopal Kanda Acquitted In Airhostess Geetika Sharma Suicide Case - Sakshi
Sakshi News home page

2012 Geetika Sharma Death Case: ఎయిర్‌హోస్టెస్‌ గీతికా శర్మ కేసు.. సంచలన తీర్పు వెల్లడించిన ఢిల్లీ కోర్టు

Published Tue, Jul 25 2023 11:57 AM | Last Updated on Tue, Jul 25 2023 1:16 PM

Haryana Gopal Kanda acquitted Airhostess Suicide Case - Sakshi

ఢిల్లీ: హర్యానాలో సంచలనం సృష్టించిన ఎయిర్‌హోస్టెస్‌ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోపాల్‌ గోయల్‌ కందాకు భారీ ఊరట లభించింది. 11 ఏళ్ల కిందటి నాటి ఈ కేసులో.. కందాని నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు.

ప్రముఖ వ్యాపారవేత్త అయినా కందాకు చెందిన ఎండీఎల్‌ఆర్‌  ఎయిర్‌లైన్స్‌లో గీతికా శర్మ ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసేది. అదే సమయంలో కందాకు చెందిన ఓ కంపెనీకి ఆమె డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టింది. అయితే..  2012, ఆగష్టు 5వ తేదీన ఢిల్లీ అశోక్‌ విహార్‌లోని తన ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో సిస్రా ఎమ్మెల్యే అయిన కందా.. కాంగ్రెస్‌ భూపిందర్‌ సింగ్‌ హూడా నేతృత్వంలోని ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి హోదాలో ఉన్నారు. 

► అయితే తన సూసైడ్‌ నోట్‌లో కందాతో పాటు ఆయన దగ్గర పని చేసే ఉద్యోగి అరుణ్‌ చందా తనను వేధించారంటూ గీతిక పేర్కొంది. అంతేకాదు ఆయనకు అంకిత అనే మరో మహిళతో సంబంధం ఉందని, వాళ్లకు ఓ బిడ్డ పుట్టిందని ఆరోపించింది. తన ఆత్మహత్యకు కందా వేధింపులే కారణమని పేర్కొందామె. 

► దీంతో భారత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో గోపాల్‌తో పాటు అరుణ్‌పైనా ‘ఆత్మహత్యకు ఉసిగొల్పారనే’ నేరం కింద అభియోగాలు నమోదు అయ్యాయి. అంతేకాదు అత్యాచారం, అసహజ శృంగారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

► ఆ సమయంలో.. కేసు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కందా తన పదవికి రాజీనామా చేసి.. పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. అంతకు ముందు అరుణ్‌ చందాను పోలీసులు గాలించి మరీ అరెస్ట్‌ చేశారు. అదే ఏడాది పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.

► అయితే కందా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు. గీతిక ఎంబీఏ చదవడానికే తానే సాయం చేశానని, సిస్రాలోని తన ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చైర్మన్‌ను సైతం చేశానని చెప్పుకొచ్చాడు. 

► ఇదిలా ఉంటే.. న్యాయం దక్కదనే ఆవేదనతో 2013 ఫిబ్రవరి 15వ తేదీన గీతిక తల్లి అనురాధా శర్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. కూతురిలాగే ఆమె సైతం సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడింది. 

2014 మార్చి 4వ తేదీన కందాకు బెయిల్‌ లభించింది. అలాగే.. ఆయనపై దాఖలైన అత్యాచారం, అసహజ శృంగారం ఆరోపణలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. 

► ఈలోపే హర్యానా లోక్‌హిత్‌ పార్టీని స్థాపించిన కందా.. తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తిరిగి 2019 ఎన్నికల్లో పోటీ చేసి సిస్రా ఎమ్మెల్యేగా నెగ్గాడు. 

► అయితే.. ఇన్నేళ్లు గడిచినా అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌వాళ్లు విఫలమయ్యారంటూ స్పెషల్‌ జడ్జి వికాస్‌ ధూల్‌ గోపాల్‌ను, అరుణ్‌ను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇవాళ సంచలన తీర్పు వెల్లడించారు. 

► గోపాల్‌ కుమార్‌ గోయల్‌ అలియాస్‌ గోపాల్‌ గోయల్‌ కందా అస్సలు చదువుకోలేదు. వ్యాపారాలతో ఎదిగి.. భారీగా ఆస్తులు సంపాదించాడు. ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించాడు. గోపాల్‌పై గీతికా శర్మ కేసు ఒక్కటే కాదు.. ఇంకా చాలానే కేసులు నమోదు అయ్యాయి.

గీతిక శర్మ సూసైడ్‌ కేసులో ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు తాజా తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమని ఆమె సోదరుడు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement