హైదరాబాద్, సాక్షి: ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబలించాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరి లేకపోవడం తీరని లోటు. ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటాం.. పోరాడతాం అని అన్నారాయన.
జమిలి ఎన్నికలతో అధికారం కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ మార్పులు, సవరణల విషయంలో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. దేశ ఐక్యతను బీజేపీ దెబ్బ తీయాలని చూస్తోంది. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలి’’ అని రేవంత్ పిలుపుచ్చారు.
‘‘దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తికి సీతారాం ఏచూరి కృషి చేశారు. పేదల కోసం పాటు పడ్డారు. జీవితకాలం నమ్మిన సిద్దాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు అరుదు. రాహుల్‌గాంధీతో సీతారాం ఏచూరికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. దశబ్దాలపాటు పేదల సమస్యలపై సీతారాం ఏచూరి కృషి చేశారు’’ అని రేవంత్ గుర్తు చేశారు.
అంతకు ముందు.. సీతారాం ఏచూరి చిత్రపటానికి కేటీఆర్, తమ్మినేని నివాళులర్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసి సీతారాం ఏచూరి చిరస్థాయిగా నిలిచారు. ప్రస్తుతం నేతలు పదవుల చుట్టూ పరిభ్రమిస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు సీతారాం ఏచూరి నిలబడ్డారు అన్నారు.
రేవంత్ రాకముందే కేటీఆర్ ఎగ్జిట్
ఒకేవేదికపై రేవంత్, కేటీఆర్ ఉంటారని తొలుత చర్చ నడిచింది. అయితే సభ ప్రారంభ సమయంలోనే కేటీఆర్ మాట్లాడి వెళ్లిపోయారు. కేటీఆర్ వెళ్లిపోయాకే సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అంతకు ముందు.. కోదండరాం పక్కనే కూర్చున్న కేటీఆర్ మాట కూడా మాట్లడలేదు. కేటీఆర్ తన ప్రసంగం ముగిశాక.. అప్పుడు కోదండరాం పలకరించారు.
Comments
Please login to add a commentAdd a comment