అనుభవానికి అగ్రతాంబూలం ఇచ్చారు. సీనియార్టీకి ప్రాధాన్యత పెంచారు. సమన్వయ పరచడంలో, విజయ సాధనలో తిరుగులేని వ్యూహకర్తలను జిల్లాల రథసారథులుగా నియమించారు. వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేస్తూ సరికొత్త టీమ్‌ను సిద్ధం చేశారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2024 ఎన్నికల్లో పార్టీ మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): పాలనా పరంగా నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాల పునర్విభజన అనంతరం పార్టీ నూతన అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రీజినల్ కో– ఆర్డినేటర్లు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
పార్టీకి మరింత బలం
కర్నూలు, నంద్యాల జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయనను రీజినల్ కో ఆర్డినేటర్‌గా నియమించడం పార్టీకి మరింత బలం చేకూర్చనుంది. గతంలో కూడా ఉమ్మడి జిల్లా బాధ్యతలు నిర్వహించి, అందరినీ సమన్వయం చేస్తూ 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీ గెలుపొందేలా సజ్జల రామకృష్ణారెడ్డి కృషి చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనకే మళ్లీ బాధ్యతలు అప్పగిండంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీనియార్టీకి ప్రాధాన్యం
జిల్లా అధ్యక్షుల నియామకంలో వైఎస్సార్‌సీపీ సీనియార్టీకి ప్రాధాన్యత ఇచ్చింది. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మంత్రాలయం ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత వై. బాలనాగిరెడ్డిని నియమించింది. ఈయన మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిగా ఉంటూ వచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. వరుసగా 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది, విశేష ప్రజాదరణ పొందారు. సీనియర్ నేత అయిన బాలనాగిరెడ్డికి జిల్లాలో మంచి పేరుంది. అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఈయన కర్నూలు జిల్లా అధ్యక్షుడు కావడంతో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం కానుంది. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నేత, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. ఈయన పాణ్యం నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నిత్యం అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజాభిమానాన్ని పొందారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో ఈయనకు విశేష అనుభవం ఉంది. ఇది వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చే అంశం.
పరుగులు పెట్టనున్న ప్రగతి
కర్నూలు జిల్లాపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించారు. ఈయన డోన్ నుంచి 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్థికశాఖ మంత్రిగా సమర్థవంతగా బాధ్యతలను నిర్వర్తించి రెండోసారి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో స్థానం సాధించారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ఆరోపణలను తనౖదైన శైలిలో తిప్పుకొడుతూ, పార్టీ కేడర్‌కు అండగా నిలుస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి కావడంతో జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షేక్ ఆంజాద్ బాషాను నంద్యాల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఈయన పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉండి 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉప ముఖ్యమంత్రిగా, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన ఈయన ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు. నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా...
ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా కొత్తగా నియమితులైన ఇన్‌చార్జ్ మంత్రులు పనిచేయనున్నారు. అలాగే పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ముందుకు వెళ్లనున్నారు. రెండు జిల్లాలకు సుపరిచితులైన వీరు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండడంతో పాటు వారిని మరింత సమన్వయపరుస్తూ ప్రతి ఇంటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా..
వైఎస్సార్‌సీపీకి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పూర్తి స్థాయి బలం ఉంది. 2014లో కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన టీడీపీ, 2019లో అన్ని స్థానాల్లో ఓటమి పాలై పూర్తిగా చతికిల పడింది. 2019 ఎన్నికల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 14 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, కొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా అన్ని జెడ్‌పీటీసీ స్థానాల్లో గెలుపొంది జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకుంది. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసింది. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో అత్యధిక శాతం కైవసం చేసుకొని నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఈ నేపథ్యంలో ఎంతో వ్యూహంతో ముందుకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరంలో జిల్లాల పునర్విభజన, మంత్రివర్గ విస్తరణతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. తాజాగా రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, జిల్లా అధ్యక్షుల నియామకంతో పార్టీ కేడర్‌లో నూతన జోష్ ఏర్పడిందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment