జిల్లా టీడీపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. కోరి తెచ్చుకున్న ఎన్నికలు కొంపముంచాయని ఆందోళన చెందుతున్నారు. అధినేత అత్యుత్సాహమే తల బొప్పి కట్టించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పంచాయతీ ఎన్నికల్లో ఇంత ఘోర పరాభవం ఎదురుకాలేదని తలలుపట్టుకుంటున్నారు. రాబోయే మూడు విడతల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయేమో అని దిగులుపడుతున్నారు. కాళ్లావేళ్లా పడి నిలబెట్టిన అభ్యర్థులు కాడి పారేస్తారేమో అని సతమతమవుతున్నారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేమనే వాస్తవాలను ఇప్పటికైనా చంద్రబాబు గ్రహించాలని కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ భవిష్యత్ ఎలా అని బెంగపెట్టుకుంటున్నారు.
సాక్షి, తిరుపతి: స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ భయపడుతోందనే విమర్శలకు తొలివిడత ఫలితాలు తిరుగులేని సమాధానమిచ్చాయి. జిల్లాలో అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కైవసం చేసుకోవడంతో విపక్షాల నోటికి తాళం పడింది. సొంత ఇలాకాలోనే చంద్రబాబుకు గట్టి షాక్ కొట్టింది. పంచాయతీ ఎన్నికల్లో బాబు నిర్ణయాలే ఆశనిపాతంగా పరిణమించాయని ఆ పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రజలు సంక్షేమానికే జై కొట్టారని ఈ ఫలితాలను చూస్తే తేటతెల్లమవుతోందని వెల్లడిస్తున్నారు. హుందాగా వ్యవహరించకుండా గిల్లికజ్జాలు పెట్టుకోవడం ద్వారా అప్రతిష్ట మూటగట్టుకోవడం మినహా సాధించేదేమీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు దుందుడుకు చర్యల వల్లే పంచాయతీలపై పట్టుకోల్పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్ శూన్యం!
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పంచాయతీలపై గట్టి పట్టు ఉండేది. 2013 స్థానిక ఎన్నికల్లో సైతం జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఇది గత వైభవంగానే మారింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతుందడడంతో తమ్ముళ్లకు దిక్కుతోచడంలేదు. తొలివిడత ఫలితాల్లో వైఎస్సార్‌సీపీకి కనుచూపు మేరలో కూడా టీడీపీ నిలవలేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మలివిడతల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని మల్లగుల్లాలు పడుతున్నారు. ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని పట్టుబట్టి తప్పు చేశామని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రాబోయే విడతల్లో పోటీకి నిలబడిన అభ్యర్థులు తమ గతి ఏంటని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. బలవంతంగా పోటీ చేయించి పరువు పోగొట్టుకునే దుస్థితి తీసుకువచ్చారని మండిపడుతున్నారు.
సంక్షేమానికే జై కొట్టారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయనకు శ్రీరామరక్ష అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఎదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరిందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పల్లెప్రగతికి చేపట్టిన కార్యక్రమాలే పంచాయతీలపై పట్టు పెంచాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నేటి ఫలితాలను చూస్తేనే తెలుస్తోందని చెబుతున్నారు.
కొట్టుకుపోయిన కుట్రలు
గత ఏడాది నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుట్రలకు తెరతీశారు. తన పలుకుబడిని ఉపయోగించి కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేయించారు. ఎన్నికల కమిషనర్‌ను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయించారు. ప్రజలు, అధికారులు, నాయకులు, ప్రభుత్వం వద్దంటున్నా పట్టుబట్టి ఎన్నికలు తీసుకువచ్చారు. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు ఎత్తులు వేశారు. అయితే అన్ని ఎత్తులను ప్రజలు చిత్తు చేశారు. ప్రజాభిమానం ముందు కుట్రలు కొట్టుకుపోతాయని నిరూపించారు. చంద్రబాబు తీరు మారకుంటే రాబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు తథ్యమని మేధావులు విశ్లేషిస్తున్నారు.
(చదవండి: పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..)
టీడీపీ కార్యకర్తల బరితెగింపు
Comments
Please login to add a commentAdd a comment