
ఇల్లందకుంట(హుజూరాబాద్): ప్రశ్నించే గొంతును మూగబోనివ్వకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని, రాజీనామా వల్లే నియోజకవర్గంలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, సిరిసేడు, మర్రివానిపల్లి, బూజునూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. రచ్చబండ తరహాలో ప్రజల మధ్య కూర్చొని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు తమ బాధలను, కష్టాలను ఈటలతో పంచుకున్నారు. అనంతరం పలువురు ఈటల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
ప్రతీ గ్రామంలో ప్రజల సంపూర్ణ మద్దతు తనకే ఉందని, కేసీఆర్ తనకు అన్యాయం చేశారని ప్రజలే అంటున్నారని..తప్పకుండా అండగా ఉండి దీవిస్తామని హామీ ఇస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో నాయకులను కొనుగోలు చేయడంతోపాటు గొర్రెల పంపిణీ, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. ‘రాజేందరన్న నువ్వు బాధపడకు. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా.. మాటలు చెప్పినా గెలిచేది మనమే అన్న’..అంటూ వంతడుపుల గ్రామానికి చెందిన సత్సి రజిత అన్నారు. అనంతరం ఈటలకు రాఖీ కట్టారు.